పెతాపం నీదా నాదా: ఇరాన్ దగ్గరగా అమెరికా యుద్ధ నౌకలు.. యుద్ధానికి రెడీ అంటున్న ఇరాన్

పెతాపం నీదా నాదా: ఇరాన్ దగ్గరగా అమెరికా యుద్ధ నౌకలు.. యుద్ధానికి రెడీ అంటున్న ఇరాన్

మిడిల్ ఈస్ట్ దేశాలు మళ్లీ వణికిపోతున్నాయి. అమెరికా యుద్ధ నౌకలు ఇరాన్ దేశం సమీపంలోకి వచ్చేశాయి. భారీ సంఖ్యలో అమెరికా యుద్ధ నౌకలు.. మరికొన్ని గంటల్లోనే ఇరాన్ దేశ జలాల్లోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ మీడియా ప్రకటించిన మరుక్షణం.. ఇరాన్ కూడా అప్రమత్తం అయ్యింది. అమెరికాతో దేనికైనా రెడీ అని ప్రకటించింది. ఈ పరిణామాలతో అమెరికా, ఇరాన్ మధ్య పూర్తి యుద్ధం తప్పదని.. దానికి ఎంతో సమయం లేదని.. ఒకటి రెండు రోజుల్లోనే ఇది జరగొచ్చనే ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఏం జరుగుతోంది అనే పూర్తి వివరాలు చూద్దాం..

ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఎస్మాయిల్ బఘై సోమవారం మాట్లాడుతూ.. ఇరాన్ పై యుద్ధానికి ముందుకొస్తే.. టెహ్రాన్ నుంచి ఊహించని ప్రతి దాడి ఉంటుందని.. కోలుకోలేని విధంగా ప్రతి స్పందన ఉంటుందని ప్రకటించారు. తుడిచిపెట్టే విధంగా ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ ఒకింత ఘాటుగానే హెచ్చరించింది.

ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ గతంలో కంటే బలంగా ఉందని బఘై చెప్పుకొచ్చారు. ఇరాకీ పారామిలిటరీ గ్రూప్ అయిన కటైబ్ హిజ్బుల్లా.. ఇరాన్‌పై దాడి చేస్తే సంపూర్ణ యుద్ధం తప్పదని హెచ్చరించింది. ఈ మేరకు కటైబ్ హిజ్బుల్లా అధిపతి అబు హుస్సేన్ అల్-హమిదావి ఆదివారం రాత్రి ఒక ఘాటైన ప్రకటన విడుదల చేశారు.

యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇరాన్‌ను లొంగదీసుకుని నాశనం చేయడానికి చీకటి శక్తులు గుమిగూడుతున్నాయని, కానీ.. ఇరాన్ దేశం ముస్లింల కోట మాత్రమే కాదు గర్వం అని అబు హుస్సేన్ అభివర్ణించారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌పై యుద్ధం అనేది మామూలు విషయం కాదని శత్రువులకు స్పష్టం చేస్తున్నామని అల్-హమిదావి హెచ్చరించారు. ఇరాన్పై యుద్ధానికి ముందుకొస్తే అత్యంత గడ్డు పరిస్థితులను చవిచూస్తారని అమెరికాను కటైబ్ హిజ్బుల్లా హెచ్చరించింది.