ఇళ్లకు చేరేందుకు వలస కూలీల కష్టాలు

ఇళ్లకు చేరేందుకు వలస కూలీల కష్టాలు
  • తోపుడు బండిపై గర్భిణి.. 700 కిలోమీటర్లు ప్రయాణం
  • మరో ఘటనలో ఎద్దుల బండిని లాగిన వ్యక్తి
  • చిన్నారిని సూట్‌కేసుపై లాకెళ్లిన తల్లి

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన ఆకస్మిక లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోని చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనులేక, తినేందుకు తిండి దొరకక వలస కూలీలు కష్టాలు పడుతున్నారు. పనులు లేక ఆకలితో చచ్చేకంటే… సొంత ఊరిలో గంజి తాగి బతకొచ్చనే ఆలోచనతో ఊరిబాట పట్టారు. ట్రాన్స్‌పోర్ట్‌ లేకపోవడంతో వందలాది కిలోమీటర్లు నడిచి తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. గర్భిణీలు, బాలింతలు కూడా నడిచి వెళ్తున్న సంఘటనలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కూలీలను తరలించేందుకు ప్రభుత్వం శ్రామిక్‌ రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ చాలా మంది అంతకుముందే ఇళ్లకు నడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌కు చెందిన ఒక కూలీ హైదరాబాద్‌ నుంచి తన సొంత ఊరికి 700 కిలోమీటర్లు నడిచి వెళ్లాడు. గర్భిణి అయిన తన భార్యను, కొడుకును ఒక తోపుడు బండిపై 700 కిలోమీటర్లు లాకెళ్లి మంగళవారం ఇంటికి చేరుకున్నాడు. రోజు ఇలాంటి ఘటనలు ఎన్నో ఘటనలు జరుగుతున్నాయి. నిద్రపోతున్న తన కొడుకును ఒక తల్లి వీల్స్‌ సూట్‌కేసుపై లాకెళ్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అయింది.

తోపుడు బండిపై భార్య, కూతురితో

మధ్యప్రదేశ్‌ బాలాకోట్‌కు చెందిన రాము, తన భార్య ధన్వంత, రెండేళ్ల కూతరు అనురాగిణితో కలిసి హైదరాబాద్‌లో పనిచేసుకుని జీవిస్తున్నాడు. అతని భార్య 8 నెలల గర్భిణి. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడంతో పనులు లేకపోవడంతో ఆయన తన సొంత గ్రామానికి వెళ్లాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బయలుదేరారు. కానీ తన భార్య అన్ని కిలోమీటర్లు నడవడం ప్రమాదమని భావించి. దారిలో కనిపించిన కర్రలు, అట్టముక్కలతో తోపుడు బండిని తయారు చేసి.. ఆమెను, తన రెండేళ్ల కూతురిని తోపుడు బండిపై 700 కిలోమీటర్లు లాకెళ్లి మంగళవారం తన సొంత గ్రామానికి చేరుకున్నాడు. ఆయన తోపుడు బండిపై భార్యను లాకెళ్తున్న వీడియోను కొంత మంది సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. కాగా.. మహారాష్ట్ర చేరుకోగానే వాళ్లను చూసిన పోలీసులు వారికి సాయం చేశారు. మెడికల్‌ చెకప్‌ చేసి వారికి వాహనం ఇచ్చి సొంత ఊరికి పంపారు. అంతే కాకుండా తినేందుకు భోజనం ఏర్పాటు చేసి.. చిన్నారికి చెప్పులు కొనిచ్చారని రాము మీడియాతో చెప్పారు.

25 కిలోమీటర్లు ఎద్దుల బండిని లాకెళ్లి

మధ్యప్రదేశ్‌ ఇండోర్‌‌లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. లాక్‌డౌన్‌ కారణంగా ఇరుక్కుపోయిన తన అన్న, అమ్మను సొంత ఊరికి తెచ్చేందుకు ఒక వ్యక్తి ఎద్దుల బండిని తానే లాగాడు. తన బండికి ఒక్క ఎద్దు మాత్రమే ఉండడంతో చేసేది లేక ఒకవైపు ఎద్దును కట్టి ఇంకోవైపు తాను బండిని లాగాడు. ఇలా 25 కిలోమీటర్లు తన తల్లి, అన్నను మోసుకెళ్లి ఇంటికి చేరుకున్నారు.

సూట్‌కేస్‌పై కొడుకును తీసుకెళ్లిన తల్లి

నడిచి.. నడిచి అలిసిపోయిన ఒక చిన్నపిల్లాడు నిద్రపోవడంతో ఆ కుర్రాడి తల్లి చిన్నారిని వీల్‌ సూట్‌కేసుపై పడుకోబెట్టుకుని లాకెళ్లింది. పంజాబ్‌ నుంచి ఝాన్సీకి 800 కిలోమీటర్లు నడిచివెళ్తున్న కూలీల బృందంలో తల్లి తన కొడుకును తీసుకెళ్తున వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. సూట్‌కేసు చాలా బరువు ఉన్నప్పటికీ తల్లి ప్రేమ ఆ కష్టాన్ని భరించేలా చేసింది. తన తోటివారితో కలిసి వెళ్లకపోతే ఇబ్బందులు పడతామనే భయంతో ఆ తల్లి ఎంత కష్టమైన కొడుకును సూట్‌కేసుపై లాకెళ్లింది. లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచి ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి. కాగా.. నడిచి వెళ్తున్న కూలీలను రోడ్డు ప్రమాదాల్లో చనిపోయిన ఘటనలు జరిగాయి.ఉత్తర్‌‌ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లో ఈ రోజు జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో మొత్తం 14 మంది కూలీలు చనిపోయారు. గూడ్స్‌ రైళ్లు ఢీకొట్టడంతో 14 మంది కూలీలు చనిపోయిన విషయం తెలిసిందే.