V6 News

మోడీ ప్రభుత్వం కాదు.. అటెన్షన్ డైవర్షన్ సర్కారు

మోడీ ప్రభుత్వం కాదు.. అటెన్షన్ డైవర్షన్ సర్కారు

కేంద్రంలో ఉన్నది మోడీ ప్రభుత్వం కాదు అటెన్షన్ డైవర్షన్ సర్కారు అని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని విమర్శించారు.  మండిపోతున్న పెట్రోల్ రేట్లు, భారమవుతున్న నిత్యవసరాల ధరలు, ఊడిపోతున్న ఉద్యోగాల నుంచి ప్రజల దృష్టి మరల్చే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కుట్రను కనిపెట్టకపోతే దేశానికి, భవిష్యత్ తరాలకు కోలుకోలేని నష్టమని అభిప్రాయపడ్డారు. 

దేశం కోసం ధర్మం కోసం అనేది బీజేపీ నినాదమైతే విద్వేషం, అధర్మం కోసం అనేది ఆ పార్టీ అసలైన రాజకీయ విధానమని కేటీఆర్ విమర్శించారు. హర్ ఘర్ జల్ అంటున్న కేంద్రం హర్ ఘర్ జహర్ (ప్రతి ఇంట్లో విషం) హర్ దిల్ మే జహర్ (ప్రతి ఒక్కరి మనసులో విషం) నింపే కుట్ర చేస్తోందని ఆరోపించారు. పచ్చగా ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టే చిల్లర ప్రయత్నం చేస్తున్నారని, విష ప్రచారాలతో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

సోషల్ మీడియా ద్వారా దేశంలోని సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతీసే కుతంత్రం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. ద్వేషం కాదు దేశం ముఖ్యమన్న ఆయన.. ఉద్వేగాల భారతం కాదు.. ఉద్యోగాల భారతం ముఖ్యమని సూచించారు.