ఎంజేపీ బ్రాండ్ క్రియేట్ చేయాలి..8వ తరగతి నుంచే పోటీ పరీక్షలకు ప్రిపేర్  చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్

ఎంజేపీ బ్రాండ్ క్రియేట్ చేయాలి..8వ తరగతి నుంచే పోటీ పరీక్షలకు ప్రిపేర్  చేయాలి : మంత్రి పొన్నం ప్రభాకర్
  • బీసీ గురుకుల సొసైటీ ప్రిన్సిపాల్స్, ఆర్సీఓలతో మంత్రి పొన్నం రివ్యూ
  • ఫలితాలు తక్కువ వస్తే ఊరుకోబోమని వార్నింగ్

హైదరాబాద్, వెలుగు: విద్యా వ్యవస్థలో మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ (ఎంజేపీ బీసీడబ్ల్యూఆర్ఈఐఎస్ ) బ్రాండ్  క్రియేట్ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్  అన్నారు. ఇతర రాష్ట్రాల వారు కూడా  ఇక్కడ అధ్యయనం చేసేలా పనిచేయాలన్నారు. పదో తరగతిలో   98.45 శాతం ఉత్తీర్ణత సాధించడంపై సెక్రటరీ సైదులుతో పాటు ప్రిన్సిపల్స్ ను మంత్రి అభినందించారు. బీసీ గురుకుల సొసైటీలో పనిచేస్తున్న ప్రిన్సిపల్స్, రీజనల్ కోఆర్డినేటర్లతో మంత్రి పొన్నం గురువారం ప్రజాభవన్ లో రివ్యూ చేపట్టారు.

టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల ప్రిన్సిపాల్స్ ను ఆయన సన్మానించారు. మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది  ఫలితాలు తక్కువగా వచ్చిన గురుకుల విద్యా సంస్థలు కారణాలు సమీక్షించుకోవాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం  మంచి ఫలితాలు సాధించేలా పనిచేయాలని, ఫలితాలు తక్కువ వస్తే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. “విద్యార్థులకు చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సైన్స్, ఏఐ, తదితర అంశాలపై అవగాహన కలిగించాలి.  

8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్, కాంపిటీటివ్  ఎగ్జామ్స్ కి ప్రిపేర్  చేయాలి. జిల్లాల్లో గురుకుల పాఠశాలలను విజిట్  చేస్తాం. మెస్ చార్జీలు, కాస్మెటిక్  చార్జీలు పెంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నాం. ప్రైవేట్  భవనాల్లో నెలవారి అద్దె కడుతున్నప్పటికీ మౌలిక సదుపాయాలు లేకపోతే కల్పించుకునే బాధ్యత ప్రిన్సిపల్స్ దే. టాయిలెట్స్, ఫ్యాన్స్, ఇతర మౌలిక సదుపాయాల ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి” అని మంత్రి అన్నారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఇన్ చార్జ్  ప్రిన్సిపల్  సెక్రటరీ బాలమయాదేవి, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు హాజరయ్యారు.