మాన్ గఢ్ స్థూపం ఇక జాతీయ స్మారకం

మాన్ గఢ్ స్థూపం ఇక జాతీయ స్మారకం

మాన్​ గఢ్​ కీ గౌరవ్​ గాథాలో ప్రకటించిన ప్రధాని మోడీ

జైపూర్ : రాజస్థాన్ లోని మాన్ గఢ్ వద్ద బ్రిటిష్​ పాలకులకు ఎదురుతిరిగిన1500 మంది గిరిజన ఫ్రీడం ఫైటర్లను ఊచకోత కోసిన ఘటనను చరిత్రకు ఎక్కించకుండా విస్మరించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గత ప్రభుత్వాలు గిరిజనుల అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. దశాబ్దాలుగా జరిగిన తప్పులను ఇప్పుడు తాము సరిచేస్తున్నామని చెప్పారు. రాజస్థాన్ బనస్వారా జిల్లాలోని మాన్ గఢ్ ధామ్ వద్ద మంగళవారం నిర్వహించిన ‘మాన్ గఢ్ ధామ్ కీ గౌరవ్ గాథా’ కార్యక్రమంలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేంద్ర పటేల్, శిరాజ్ సింగ్ చౌహాన్ తో కలిసి ప్రధాని పాల్గొన్నారు.

మాన్ గఢ్ ధామ్ ను ‘జాతీయ స్మారకం’గా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘మాన్ గఢ్ వద్ద 1913, నవంబర్ 17న భిల్ గిరిజన తెగ వీరుడు శ్రీ గోవింద్ గురు ఆధ్వర్యంలో లక్షన్నరకుపైగా గిరిజన ఫ్రీడం ఫైటర్లు పోరాటం చేయగా.. 1500 మందిని బ్రిటిష్​ వాళ్లు కాల్చిచంపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చరిత్రను రాసిన వాళ్లు దురదృష్టవశాత్తూ మాన్ గఢ్ గాథను పక్కనపెట్టారు. దశాబ్దాల తప్పును ఇప్పుడు దేశం సరిచేస్తోంది” అని ప్రధాని అన్నారు.

అందుకే మోడీకి విదేశాల్లో గౌరవం : గెహ్లాట్ 
గాంధీ మహాత్ముడు పుట్టిన దేశానికి, 70 ఏండ్లుగా చెక్కుచెదరని ప్రజాస్వామ్యంతో కొనసాగుతున్న దేశానికి ప్రధాని అయినందుకే ప్రధాని మోడీకి ప్రపంచ దేశాల్లో అత్యున్నత గౌరవం దక్కుతోందని రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు.