ఇయ్యాల, రేపు కూడా వానలు

ఇయ్యాల, రేపు కూడా వానలు
  • ఇయ్యాల, రేపు కూడా వానలు.. రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరించే చాన్స్‌‌
  • రాష్ట్రంలో తగ్గిన వేడి, ఉక్కపోత 
  • యెల్లో అలెర్ట్‌‌ జారీ చేసిన వాతావరణ శాఖ

హైదరాబాద్‌‌, వెలుగు: రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. సోమవారం మహబూబ్‌‌నగర్‌‌ జిల్లాలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని జిల్లాలకు, ఆ తర్వాతి రెండు రోజుల్లో రాష్ట్రమంతా విస్తరిస్తాయని వెల్లడించింది. ఈ సారి రుతుపవనాలు ఐదు రోజులు ఆలస్యంగా వచ్చాయి. ఈ నెల 8నే రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ నాలుగు రోజులు ఆలస్యంగా సోమవారం రాష్ట్రంలో ప్రవేశించాయి. కిందటేడు జూన్‌‌‌‌‌‌‌‌ 5నే రుతుపవనాలు రాష్ట్రమంతా విస్తరించాయి. ఈసారి జూన్‌‌‌‌‌‌‌‌ 2న కేరళకు వస్తాయని అంచనా వేయగా, మూడు రోజులు ముందుగానే మే 29న కేరళలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈసారి జూన్‌‌‌‌‌‌‌‌ నుంచి సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ వరకు వర్షపాతం సాధారణం (106శాతానికి పైనే) కంటే ఎక్కువగా నమోదయ్యే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. జూన్‌‌‌‌‌‌‌‌లో నెలలో మాత్రం సాధారణ వర్షపాతమే నమోదు కానుందని తెలిపింది.

ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల లోపే

వాతావరణంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలో ఉష్టోగ్రలకు కాస్త తగ్గాయి. ఇటీవల 43 నుంచి 45 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు సోమవారం మూడు జిల్లాలు మినహా అన్ని చోట్ల 40డిగ్రీల లోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం జిల్లాలోని మధిరలో 41.5, సూర్యాపేటలోని మునగాల, నల్లగొండలోని దామరచర్లలో 41.4 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఉక్కపోత, వేడిమి తగ్గింది. ఇప్పటి నుంచి వాతావరణం ఇలాగే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఎండలు కూడా మరింత తగ్గుతాయంటున్నారు.

వానలు షురూ..

రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాల రాకతో పలు జిల్లాల్లో వానలు పడ్డాయి. ఉరుములు, మెరుపుతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఆదివారం రాత్రి నుంచి సోమవారం వరకు జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లిలోని మల్లారంలో 7 సెం.మీ., కామారెడ్డిలోని మెనూరులో 6.9, మంచిర్యాలలోని కోటపల్లిలో 6.5, సిద్దిపేటలోని తిమ్మారెడ్డిపల్లిలో 5.3 సెం.మీ., నాగర్​ కర్నూల్​ జిల్లా తాడూరులో 3 సెం.మీ చొప్పున వర్షపాతం రికార్డయ్యింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు కురిసే చాన్స్‌‌‌‌‌‌‌‌ ఉందని హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30నుంచి 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం పడవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, పెద్దపల్లి, జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయంది. ఈ మేరకు యెల్లో అలెర్ట్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది.