పోలింగ్ రోజు మెట్రో టికెట్​ ధరపై రాయితీ

పోలింగ్ రోజు మెట్రో టికెట్​ ధరపై రాయితీ

ముంబై: లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్​ శాతం పెంచేందుకు హోటళ్లు, షాపింగ్ మాల్స్ పలు రాయితీలు ప్రకటించడం ఇప్పటికే చూశాం.. తాజాగా ముంబై మెట్రో కూడా డిస్కౌంట్ ​ప్రకటించింది. పోలింగ్​ బూత్​ దాకా వెళ్లి ఓటేసి వచ్చేలా ప్రోత్సహించేందుకు ప్రయాణీకులకు టికెట్ ధరపై రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. పోలింగ్​ రోజు నిర్ణీత రూట్ లో ప్రయాణించే వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. 

ఈ నెల 20న ముంబైలోని ఐదు లోక్ సభ నియోజకవర్గాల్లో  పోలింగ్​ జరగనుంది. ఈ క్రమంలోనే ముంబై మెట్రో ఆ రోజు ప్రయాణించే వారికి టికెట్ ధరపై 10% రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులలో అవగాహన పెంచి, వారు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడడమే ఈ ఆఫర్ ఉద్దేశమని తెలిపింది. 

ఈ నెల 20న మెట్రో లైన్ 2ఏ ((అంధేరీ (వెస్ట్) – దహిసర్ (ఈస్ట్) రూట్), లైన్ 7 ((దహిసర్ (ఈస్ట్) – అంధేరి (ఈస్ట్) రూట్) మార్గాల్లో ప్రయాణించే వారికి ఈ రాయితీ వర్తిస్తుందని ముంబై మెట్రో ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎంఎంఎంఓసీఎల్) ఓ ప్రకటనలో తెలిపింది. సిస్టమాటిక్ ఓటర్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ కార్యక్రమంలో భాగంగా మెట్రో ప్రయాణీకులను ఎన్నికల ప్రక్రియలో పాలుపంచుకునేలా చూడడానికి ఈ రాయితీ ఇస్తున్నట్లు వివరించింది. ఈ ఆఫర్​తో పోలింగ్​ శాతం పెరుగుతుందని ముంబై మెట్రో ఆశాభావం వ్యక్తం చేసింది.