హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నాలుగైదేండ్లలో సగానికిపైగా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కాలేజీలు మూతపడ్డాయి. టీచర్ పోస్టులను సర్కారు భర్తీ చేయకపోవడంతో ఈ కోర్సులో చేరేందుకు స్టూడెంట్లు ఆసక్తి చూపించడం లేదు. ఫీజు కూడా తక్కువగా ఉండటం, ఆ మొత్తాన్ని సర్కారు ఆలస్యంగా ఇస్తుండటంతో నిర్వహణ భారమై మేనేజ్మెంట్లు కాలేజీలను మూసేస్తున్నాయి. 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. అంటే నాలుగైదేండ్లలోనే 112 కాలేజీలు మూతపడ్డాయి. ప్రస్తుతం ఉన్నవాటిలో ఉమ్మడి జిల్లాకొకటి చొప్పున పది సర్కారు కాలేజీలు కాగా.. మిగతావి 90 ప్రైవేటు కాలేజీలు. 2017–18లో 11,500 డీఎడ్ సీట్లుంటే, 7,650 మాత్రమే భర్తీ అయ్యాయి. గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 మాత్రమే నిండాయి. ఏటా అప్లయ్ చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గిపోతోంది. గతేడాది మెజార్టీ ప్రైవేటు కాలేజీల్లో 20 మందిలోపే స్టూడెంట్లు చేరారు.
టీఆర్టీ లేక తగ్గిన డిమాండ్
డీఎడ్ చేసిన వారు ఎస్జీటీ పోస్టులకు మాత్రమే అర్హులు. గతంలో బీఎడ్తో పోలిస్తే డీఎడ్ చేస్తే పక్కా టీచర్ జాబ్ అన్నట్టు ప్రచారం ఉండేది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేవలం 2017లోనే అరకొర ఖాళీలతో టీచర్ పోస్టులను భర్తీ చేసింది. మళ్లీ టీచర్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేస్తుందో క్లారిటీ లేదు. మరోపక్క స్టూడెంట్, టీచర్ రేషియోతో పోలిస్తే ఇప్పటికే వేల టీచర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. దీంతో ఎస్జీటీ పోస్టుల భర్తీ అనుమానంగా మారింది. రాష్ట్రంలో ఇప్పటికే డీఎడ్ పూర్తిచేసినవాళ్లు లక్షల్లో ఉన్నారు.ప్రస్తుతం డీఎడ్ చేసినా పెద్దగా ప్రయోజనం ఉండదని భావించి అందులో చేరేందుకు స్టూడెంట్లు ఇంట్రస్ట్ చూపడం లేదు.
నిర్వహణ భారమై..
ప్రస్తుతం ఒక్కో ప్రైవేటు డీఎడ్ కాలేజీలో 50 సీట్లు ఉండగా.. వాటిలో పది సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద భర్తీ చేస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన వారికి ఏటా రూ. 11 వేల ఫీజు రీయింబర్స్మెంట్, రూ. 1,500 ఇతర ఖర్చుల కింద సర్కారు ఇస్తుంది. ఈ ఫీజుతో కాలేజీల నిర్వహణ కష్టమని, జీతాలివ్వడం కష్టమేనని మేనేజ్మెంట్లు అంటున్నాయి. వచ్చే ఫీజునూ ఏండ్లుగా సర్కారు పెండింగ్లో పెడుతుండటం ఇబ్బందిగా మారింది. దీంతో కాలేజీలను క్లోజ్ చేయడంపైనే దృష్టి పెట్టాయి. ఇందుకోసం ఇప్పటికే చాలా కాలేజీలు అప్లయ్ చేసుకున్నాయి.
సర్కారు తీరు వల్లే ...
రాష్ట్ర సర్కారు తీరు వల్లనే డీఎడ్ కోర్సుకు డిమాండ్ తగ్గుతోంది. ఒక్కో కాలేజీకి 50 సీట్లకు పర్మిషన్ ఇచ్చారు. కన్వీనర్ కోటాలో ఒక్కో స్టూడెంట్కు రూ. 12,500 ఫీజు ఇస్తున్నారు. ఏండ్ల నుంచి ఈ ఫీజును పెంచడం లేదు. దీంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారింది.
‑ డాక్టర్ రామదాసు,
ఎస్సీటీఈ సెంట్రల్ కమిటీ మెంబర్
