ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు అవాస్తవం : ఇంఛార్జీ సీపీ

ఎంపీ బండి సంజయ్ ఆరోపణలు అవాస్తవం : ఇంఛార్జీ సీపీ

కరీంనగర్ : పోలీసులపై ఎంపీ బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం అన్నారు ఇంఛార్జీ సీపీ సత్యనారాయణ. డ్రైవర్ బాబు అంత్యక్రియల్లో ఎంపీ బండి సంజయ్ పై పోలీసులు దాడి చేశారనే దానిపై సత్యనారాయణ శనివారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘నంగునూరి బాబు మృతదేహం కరీంనగర్ వచ్చిన సందర్భంగా లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందనే డిపోకు బదులు ఇంటికి మృతదేహాన్ని పంపించాం. ఎంపీ వచ్చి చర్చలు జరిపితేనే అంత్యక్రియలు జరుతామని అక్కడే కూర్చున్నారు. ఫ్రీజర్ పాడవడంతో కుటుంబ సభ్యులు ఎంపీపై ఒత్తిడి తెచ్చారు. డిపో వద్దకు తీసుకెళ్తే శాంతి భద్రతల సమస్యలు వచ్చే అవకాశం ఉండటంతో అనుమతి ఇవ్వలేదు. దమ్ముంటే ఆపండని ఎంపీ ఛాలేంజ్ చేశారు. కుటుంబసభ్యులు కూడా స్మశాన వాటికకే తరలించేందుకే ఒప్పుకున్నారు. తోపులాటలో మా పోలీసులు కూడా కింద పడిపోయారు. క్రౌడ్ ను అడ్డుకునే క్రమంలో అందరినీ లాగేశాం. అదే సమయంలో ఎంపీగారు వచ్చారు. పడిపోయే క్రమంలో ఏసీపీ విజయసారథి చేయి అడ్డం పెట్టారు తప్ప కొట్టలేదు. ఎంపీకి రక్షణ కల్పించే క్రమంలోనే చొక్కా కూడా భుజం దగ్గర పట్టుకొని పక్కకు తీసుకెళ్ళే ప్రయత్నం చేశారు. గల్లా పట్టుకోలేదు. మేము ఎలాంటి దౌర్జన్యం చేయలేదు.

ఊపిరాడని స్థితిలో పడిపోయిన ఎంపీ బండి సంజయ్ కు నేనే గాలి ఆడేలా రక్షణ కల్పించాను. టీవీ ఛానెల్ విజువల్స్ కూడా క్లీయర్ గా చూస్తే మా బాడీ లాంగ్వేజ్ మీకు అర్థమవుతుంది. మేము ఎవరినీ అరెస్టు కూడా చేయలేదు. ప్రజా శాంతికి భంగం కలగకూడదనే బందోబస్తు ఏర్పాటు చేశాం. ఉపన్యాసాల్లో ఎట్టిపరిస్థితిలోనూ డిపోకు తీసుకెళ్తామన్నారు.  6.5 కిలోమీటర్ల దూరం పంపిస్తే ఇబ్బందులు వస్తాయని నేతలకు, కుటుంబసభ్యులకు చెప్పాం. ఆ మేరకు కరీంనగర్ వెళ్ళకుండా 2, 3 వలయాలు పెట్టాం. ఎంపీ, వారి అనుచరులు అగ్రెసివ్ గా కేకలు వేస్తూ దూషిస్తూ మా పైకి దూసుకు వచ్చారు. తోపులాటలో పోలీసులతో పాటు చాలా మంది పడిపోయారు.  అందరిని పక్కకు లాగే క్రమంలో అంజన్న అనే పోలీసు ఎడమ చేయి పట్టుకుని.. ఎంపీని పక్కకు లాగే ప్రయత్నంలో చొక్కా పట్టుకున్నారు. ఎంపీగారి రక్షణ కోసమే అంబులెన్స్ కూడా పెట్టాం. తనపై దౌర్జన్యం చేశారన్న కారణంగా కోర్టు చౌరస్తాలో ధర్నా చేశారు. దాహంతో తపిస్తూ ఊపిరాడని పరిస్థితుల్లో ఎంపీ పడిపోతే నేను దగ్గరకు వెళ్ళి గాలి ఆడేలా చేశా.

ఇలాంటి బందోబస్తు సమయంలో చిన్న చిన్న దెబ్బలు మాకు కూడా తగిలాయి. కమిషనరేట్ దగ్గర కూడా ఆయన మా పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బండి సంజయ్ పై మేం ఎలాంటి దౌర్జన్యం చేయలేదు. దానిపై నాతో సహా ఏ ఎంక్వైరీ కైనా సిద్ధం. డీజీ ఆదేశాల మేరకు మాకు సంబంధం లేని అధికారులతో ఎంక్వైరీ జరుగుతోంది. దురుసు ఘటనల్లో పాల్గొన్న వారిపై విచారణ జరుపుతున్నాం.  అవసరం మేరకు కొంత మందిపై కేసులు పెట్టే అవకాశం ఉంది. బూటు కాలితో తొక్కామనడం అవాస్తవం. శవాన్ని పోలీసులు ఎత్తుకెళ్లారని ఎంపీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. మేమూ మనుషులమే. మేం అలాంటి పనులు చేయం. దహన క్రతువులు పట్ల మాకు గౌరవం ఉంది’. అని తెలిపారు ఇంఛార్జీ సీపీ సత్యనారాయణ.