నన్ను అరెస్ట్ చెయ్యనీకే.. నీకు పీఎం పదవి ఇచ్చిన్రా ? : సీఎం రేవంత్ రెడ్డి

నన్ను అరెస్ట్ చెయ్యనీకే.. నీకు పీఎం పదవి ఇచ్చిన్రా  ? : సీఎం రేవంత్ రెడ్డి

దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేసేందకు కుట్ర జరుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన దగ్గర ఉన్నాయని సాయంత్రం 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి చెబుతానని తెలిపారు.  దేశంలో బీజేపీ రిజర్వేషన్లు తీసేయాలని కుట్ర చేస్తుందని ఆరోపించారు.  కులగణనకు మోదీ ఒప్పుకోలేదని కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారని తెలిపారు.

 దేశ సంపదను మోదీ, అదానీ, అంబానీలకు దోచి పెట్టారని ఆరోపించారు. కోరుట్లలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ జనజాతర సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు కాంగ్రెస్ న్యాయం చేయాలని చూస్తుందని తెలిపారు.  రాజ్యాంగాన్ని మార్చేందుకే బీజేపీ 400 వందల సీట్లు అంటుందని ఆరోపించారు. ప్రశ్నించినందుకు తనపై మోదీ అమిత్ షా కుట్ర చేశారని చెప్పారు. 

ఢిల్లీలో కేంద్ర హోం శాఖ తనపై కేసు పెట్టిందని తెలిపారు. ఈడీ, సీబీఐతో పాటు ఢిల్లీ పోలీసులు తమని బయపెట్టాలని చూస్తున్నారని, గతంలో కేసీఆర్ నూ ఇలాగే బయపడితే జనం బుద్ది చెప్పారని అన్నారు. ఢిల్లీలో పోలీసులు, సీబీఐ ఉండొచ్చని తన దగ్గర 4 కోట్ల మంది ప్రజలు ఉన్నారని తెలిపారు. తనను అరెస్టు చేయడానికి మీకు పీఎం పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు.  మొదటి సారి సీఎం అయ్యాను పీఎంకు గౌరవం ఇస్తానని వెల్లడించారు. 

మెట్రో రైలు, మూసీ ప్రక్షాలనకు నిధులు ఇవ్వండని అడిగితే అణా పైసా ఇవ్వలేదని, హైదరాబాద్ కు కృష్ణా జలాలు అధనంగా అడిగితే ఇయ్యలేదని విమర్శించారు. పార్లమెంట్ లో మోదీ తెలంగాణను అవమానించారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.