ఈమె నిజాయితీకి కొలమానం లేదు.. రూ.45 లక్షల బంగారాన్ని పోలీసులకు అప్పగించిన కార్మికురాలు

ఈమె నిజాయితీకి కొలమానం లేదు.. రూ.45 లక్షల బంగారాన్ని పోలీసులకు అప్పగించిన కార్మికురాలు

జీవితంలో సెటిల్ అయిపోయే అవకాశాలు కొందరిని వెతుక్కుంటూ వస్తుంటాయి. కానీ అందరూ వాటిని సొంతం చేసుకోరు. అప్పనంగా వచ్చింది మనకెందుకులే.. మన కష్టార్జితమే మనకు చాలు అనుకుంటుంటారు. అలాంటి వారిలో ఈ మహిళ ముందువరుసలో ఉంటుంది కావచ్చు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 45 లక్షల రూపాయల బంగారం దొరికితే పోలీసులకు అప్పగించి వార్తల్లో నిలిచింది ఈ పారిశుధ్య కార్మికురాలు. 

తమిళనాడు చెన్నై లోని ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన పద్మ (45) అనే పారిశుధ్య కార్మికురాలు రోజులాగే పనిచేస్తుంటే ఓ బ్యాగ్ దొరికింది. టీ నగర్ లోని ముపాతు అమ్మన్ కోయిల్ దగ్గర పని ముగించుకుని ఇంటికెళ్లే సమయంలో బ్యాగ్ కనిపిస్తే.. ఎవరో పారేశారని అనుకున్నా. తెరిచి చూస్తే బంగారు ఆభరణాలు కనిపించాయి. వెంటనే మా పై అధికారులకు తెలియజేశాను అని బ్యాగ్ గురించి చెప్పారు ఆమె.

ఆ తర్వాత పాండీ బజార్ పోలీస్ స్టేషన్ లో అప్పగించారు కార్మికురాలు పద్మ. బంగారం పోగొట్టుకున్న వ్యక్తి ఫిర్యాదు మేరకు ఆ బ్యాగ్ ఎవరిదో గుర్తించి వారికి అప్పగించారు పోలీసులు. బ్యాగ్ పోగొట్టుకున్న బాధితులకు చేరడం సంతోషంగా ఉందన్నారు పద్మ. ఆ బంగారం వాళ్లకు ఇవ్వకుంటే ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులకు గురయ్యేదో. గోల్డ్ వాళ్లకు చేరడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆమె చెప్పారు. 

►ALSO READ | కొత్త స్మార్ట్ ఫోన్ రూల్స్.. ప్రభుత్వం చేతిలోనే ఫోన్ అప్‌డేట్స్, మోడీ సర్కార్ సంచలనం

బ్యాగులో ఉన్న బంగారం 45 సావరైన్స్ ఉంటుందట. అంటే 360 గ్రాములు. ఇప్పుడున్న ధరలతో చూస్తే 45 లక్షల రూపాయల విలువ చేస్తుంది. ఆమె నిజాయితీని పోలీసులు మెచ్చుకున్నారు.  ఆమె భర్త సుబ్రమణి కూడా ఐదేళ్ల క్రితం ఆటోలో దొరికిన రూ.1.5లక్షలను బాధితులకు అందించి ఆదర్శంగా నిలిచారు. ఈ దంపతుల నిజాయితీని అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.