మోడీ ప్రభుత్వం దేశంలోని 75 కోట్ల స్మార్ట్‌ఫోన్ వినియోగదారుల భద్రత కోసం అత్యంత కఠినమైన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా జరిగే డేటా చోరీ, ఆన్‌లైన్ మోసాలకు అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా సుమారు 80 కొత్త భద్రతా నిబంధనలతో కూడిన ముసాయిదాను సిద్ధం చేస్తోంది. అయితే ఈ నిబంధనలు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలైన ఆపిల్, శామ్‌సంగ్, షియోమీ వంటి సంస్థల్లో కలవరం పుట్టిస్తున్నాయి.
సౌర్స్ కోడ్ షేరింగ్:
ప్రభుత్వం ప్రతిపాదించిన 'ఇండియన్ టెలికామ్ సెక్యూరిటీ అస్యూరెన్స్ రిక్వైర్మెంట్స్' ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు తమ ఫోన్లలోని ప్రోగ్రామింగ్ సోర్స్ కోడ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన లాబొరేటరీలకు అప్పగించాల్సి ఉంటుంది. సాఫ్ట్‌వేర్‌లో ఏవైనా లోపాలు ఉన్నాయా లేదా విదేశీ శక్తుల నిఘా ఉందా అని పరీక్షించడానికి ఇది తోడ్పడనుంది. అయితే తమ ఐపీ సంబంధించిన అత్యంత రహస్యమైన కోడ్‌ను బయటపెట్టడం కుదరదని టెక్ కంపెనీలు వారిస్తున్నాయి.
సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లపై నిఘా..
కొత్త రూల్స్ ప్రకారం.. కంపెనీలు ఏదైనా మేజర్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ లేదా సెక్యూరిటీ ప్యాచ్‌ను విడుదల చేసే ముందే ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి. అధికారులు ఆ అప్‌డేట్‌ను పరీక్షించిన తర్వాతే యూజర్లకు పంపే అవకాశం ఉంటుంది. దీనివల్ల సాఫ్ట్‌వేర్ భద్రత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తుండగా.. ఇది పనితీరును నెమ్మదింపజేస్తుందని కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
మాల్‌వేర్ స్కాన్‌లు - స్టోరేజ్ ఇబ్బందులు
ప్రతి ఫోన్ నిర్ణీత కాలవ్యవధిలో ఆటోమేటిక్‌గా మాల్‌వేర్ స్కాన్‌లను నిర్వహించాలని భారత ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్, ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా గత 12 నెలల ఫోన్ యాక్టివిటీ లాగ్స్ స్టోర్ చేయాలని ముసాయిదా పేర్కొంది. కానీ సాధారణ ఫోన్లలో అంత డేటాను నిల్వ చేసే సామర్థ్యం ఉండదని మెుబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ చెబుతున్నారు.
►ALSO READ | పార్లమెంట్ ఎంపీ టూ బ్లింకిట్ రైడర్.. రాఘవ్ చద్దా క్రేజీ ప్రయత్నం.. వీడియో వైరల్!
ఈ ప్రతిపాదనలపై ఐటీ శాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ స్పందిస్తూ.. పరిశ్రమ వర్గాల ఆందోళనలను పరిశీలిస్తామని, ఫైనల్ నిర్ణయాలు ఇంకా తీసుకోలేదని స్పష్టం చేశారు. కేవలం దేశ భద్రత, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ కసరత్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ వారంలో జరగబోయే కీలక సమావేశంలో టెక్ కంపెనీల ప్రతినిధులతో చర్చించి ఒక మధ్యేమార్గాన్ని అన్వేషించే అవకాశం ఉందని తెలుస్తోంది.
