హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టబోతున్న ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను ఎయిడెడ్, మోడల్ స్కూల్, గురుకుల టీచర్లకు కూడా వర్తింపజేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి సీఎంను కలిసి వినతిపత్రం అందజేశారు. హెల్త్ కార్డులు లేకపోవడంతో వేలాది మంది టీచర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎంకు విన్నవించారు. కొత్త హెల్త్ స్కీమ్ నుంచి వీరిని మినహాయించవద్దని కోరారు. సీఎం సానుకూలంగా స్పందించి వెంటనే దీన్ని అమల్లోకి తేవాలని సీఎస్ రామకృష్ణారావుకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
పెన్షనర్ల సమస్యలు పరిష్కరిస్తం..
మరోవైపు రాష్ట్ర పెన్షనర్ల సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన పేరి వెంకటరెడ్డి కూడా సీఎం రేవంత్‌ను కలిశారు. పెన్షనర్లకు రావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్ బకాయిలను జాప్యం చేయకుండా వెంటనే రిలీజ్ చేయాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వారివెంట పీఆర్టీయూ రాష్ట్ర నేత శ్రీనివాస్ రెడ్డి తదితరులున్నారు.
