- విదేశీ మీడియాలో కథనాలు
- ఏఐ టూల్స్, అల్గారిథమ్స్ సాయంతో ఖమేనీ లొకేషన్ గుర్తింపు
- రాత్రి పూట దాడి వ్యూహం మార్చి ఉదయాన్నే అటాక్ చేసిన ఇజ్రాయెల్
జెరూసలెం: ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అమెరికా సాయంతో ఇజ్రాయెల్ మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, దీనివెనుక ఏండ్లనుంచి కొనసాగిన నిఘా వ్యూహం ఉన్నదని ‘ఫైనాన్షియల్ టైమ్స్’ ఓ కథనంలో వెల్లడించింది. ఇరాన్ ట్రాఫిక్ కెమెరా నెట్‌వర్క్‌ను హ్యాక్ చేయడం, మొబైల్ ఫోన్ సిస్టమ్స్‌లోకి చొరబడటం ద్వారా ఖమేనీ కదలికలను ఇజ్రాయెల్ నిరంతరం పర్యవేక్షించినట్టు వెల్లడించింది. టెహ్రాన్‌లోని దాదాపు అన్ని ట్రాఫిక్ కెమెరాలు గత కొన్నేండ్లుగా ఇజ్రాయెల్ కంట్రోల్‌లో ఉన్నాయి. ఈ కెమెరాల నుంచి వచ్చే ఫుటేజీని ఎన్‌క్రిప్ట్ చేసి, నేరుగా టెల్ అవీవ్, దక్షిణ ఇజ్రాయెల్‌లోని సర్వర్లకు పంపేవారు.
ముఖ్యంగా ఖమేనీ నివాసం ఉండే ‘పాశ్చర్ స్ట్రీట్’ పరిసరాల్లోని కెమెరాల ద్వారా ఆయన బాడీగార్డ్స్ తమ వ్యక్తిగత వాహనాలను ఎక్కడ పార్క్ చేస్తారు? వారి రోజువారీ దినచర్య ఎలా ఉంటుంది? అనే అంశాలను ఇజ్రాయెల్ నిశితంగా గమనించింది. అలాగే, ఖమేనీ ఎక్కడ నివసిస్తారు? ఎవరిని కలుస్తారు? ప్రమాదం వస్తే ఎక్కడికి వెళ్తారు? అనే అంశాలపై లోతైన అధ్యయనం చేశాయి. ‘ఎప్పటికప్పుడు సేకరించిన సమాచారాన్ని ఒక క్రమంలోకి తీసుకువచ్చేందుకు ఇజ్రాయెల్ ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించింది. ఫిబ్రవరి 28న అత్యంత కచ్చితత్వంతో ఖమేనీని టార్గెట్ చేయడానికి ఈ డేటానే ఉపయోగపడింది.
వ్యూహం మార్చి అటాక్..
ఖమేనీ ప్రతి శనివారం తన అధికారిక నివాసంలో ప్రభుత్వ పెద్దలు, సైనిక ఉన్నతాధికారులతో రివ్యూలు నిర్వహించేవారు. ఇది టెహ్రాన్ నగర నడిబొడ్డులోని ఒక ప్రభుత్వ ప్రాంగణంలో ఉంటుందని ఇజ్రాయెల్ తెలుసుకున్నది. సాధారణంగా రాత్రి పూట దాడులు చేస్తారు.. కానీ ఇజ్రాయెల్ ఈసారి వ్యూహం మార్చి ఉదయం 6 గంటలకు (స్థానిక కాలమానం) దాడికి పాల్పడింది.
కేవలం 60 సెకన్ల వ్యవధిలో మూడు ప్రధాన లక్ష్యాలపై కచ్చితత్వంతో కూడిన మిసైల్స్‌ను ప్రయోగించింది. ఈ దాడిలో ఖమేనీతో పాటు రివల్యూషనరీ గార్డ్ చీఫ్ సహా సుమారు 40 మంది ఉన్నతాధికారులు మరణించారు. ఈ వ్యవహారంలో అమెరికా
నిఘా సంస్థ సీఐఏ సమాచారం కీలకంగా మారింది.
