- గిట్టుబాటు కాక రైతు విలవిల
- ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు కూడా రాకపోవడంతో పంటను చేనులోనే వదిలేస్తున్న దుస్థితి
మహబూబాబాద్, వెలుగు: టమాట సాగు చేసిన రైతులకు ఈ సీజన్‌లో కన్నీళ్లు తప్పడం లేదు. నెల క్రితం వరకు కేజీ రూ.50 పలికిన టమాట ధర ప్రస్తుతం రూ.5కే పరిమితమైంది. తెంపిన కూలీ, మార్కెట్‌కు తరలింపు ఖర్చులు కూడా రాకపోవడంతో రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోతున్నారు.
చాలామంది రైతులు పండిన పంటను చేనులోనే వదిలేస్తుండగా, మరికొందరు రిస్క్ తీసుకుని మార్కెట్‌కు తీసుకెళ్లినా సరైన ధర దక్కక ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలకేంద్రంలో ఓ రైతు సంతలో టమాటాలను ఉచితంగా పంచగా ప్రజలు ఎగబడ్డారు.
పెరిగిన సాగు..
మహబూబాబాద్ జిల్లాలోని 18 మండలాల్లో ఈ ఏడాది 2,376 ఎకరాల్లో టమాట సాగు చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే వెయ్యి ఎకరాలకు పైగా సాగు విస్తీర్ణం పెరిగింది. గతంలో మంచి లాభాలు రావడంతో రైతులు ఈసారి టమాట సాగు వైపు మొగ్గుచూపారు. నర్సింహులపేట, తొర్రూరు, మహబూబాబాద్, కురవి, డోర్నకల్, సీరోల్, మరిపెడ, దంతాలపల్లి, నెల్లికుదురు మండలాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. అయితే ధరలు పడిపోవడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.
పెట్టుబడి కూడా దక్కట్లే..
టమాట సాగులో ఎకరాకు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి అవుతుంది. పంట కాలం మూడు నెలలకు పైగా ఉంటుంది.
మొదటి వారంలోనే రెండు రోజులకు ఒకసారి సుమారు 25 క్వింటాళ్లకు పైగా దిగుబడి వస్తుంది. ఆ తర్వాత ప్రతి రోజూ కోత ఉంటుంది. ప్రస్తుతం హోల్సేల్ మార్కెట్‌లో చిన్న సైజు టమాట 10 కేజీల ట్రేకు రూ.60, పెద్ద సైజు టమాట రూ.80 వరకు మాత్రమే పలుకుతోంది. కొన్నిసార్లు కొనుగోలు దారులు లేక మిగిలిన టమాటలను పారబోయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.
పంట బాగుంది.. ధరే లేదు
అర ఎకరంలో టమాట సాగు చేసి రూ.లక్ష పెట్టుబడి పెట్టిన. ప్రస్తుతం రూ.2 లక్షల విలువ చేసే దిగుబడి ఉన్నా.. ధర లేక విక్రయించలేకపోతున్నా. పంటను చేనులోనే వదిలేసిన. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి.- యాకూబ్, నర్సింహులపేట
