- వెయ్యి చదరపు మీటర్ల వరకే పర్మిషన్ ఇవ్వొచ్చు
- హైరైజ్ బిల్డింగులు, లే అవుట్లకు హెచ్ఎండీఏనే..
- 650 చ.కి.మీ. పరిధిలోనే జీహెచ్ఎంసీకి పూర్తి అధికారం
- స్పష్టం చేసిన హెచ్ఎండీఏ ఉన్నతాధికారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు జీహెచ్ఎంసీలో విలీనమైనా ఆయా ప్రాంతాల్లో హెచ్ఎండీఏ అధికారాలు మాత్రం అలాగే ఉంటాయని ఆ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. జీహెచ్ఎంసీలోకి శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కలిసిన నేపథ్యంలో ఆ ఏరియాల్లో భారీ భవన నిర్మాణాల అనుమతులు, లేఅవుట్ల పర్మిషన్స్ హెచ్ఎండీఏ నుంచి బల్దియాకు ట్రాన్స్ఫర్ చేస్తారన్న ప్రచారంలో నిజం లేదంటున్నారు. ఇంతకు ముందున్నట్టు 650 చ.కి.మీ. పరిధిలోనే బల్దియాకు పూర్తి అధికారాలు ఉంటాయంటున్నారు.
విస్తరించిన ప్రాంతాల్లో హైరైజ్బిల్డింగులు, లే అవుట్ల అనుమతులు హెచ్ఎండీఏనే ఇస్తుందని చెప్తున్నారు. విలీన ప్రాంతాల్లో కేవలం వెయ్యి చదరపు అడుగులు, ఏడంతస్తుల బిల్డింగులకు వరకే బల్దియా పర్మిషన్లు ఇవ్వొచ్చంటున్నారు. ఓఆర్ఆర్, శివారు ప్రాంతాల్లో హైరైజ్భవనాలు, లేఅవుట్లు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల అనుమతుల ద్వారానే తమకు 90 శాతం ఆదాయం వస్తోందని, ఈ ఏరియాల్లో పర్మిషన్ల బాధ్యతలు బల్దియాకు ఇస్తే తాము ఆదాయం కోల్పోవాల్సి వస్తుందంటున్నారు. దీనివల్ల లోన్ల సేకరణ, బాండ్ల జారీ వంటి ప్రక్రియకు ఇబ్బందులు వస్తాయంటున్నారు.
అంతా మాస్టర్ ప్లాన్ ప్రకారమే..
ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని ట్రిపుల్ఆర్వరకూ విస్తరించింది. గతంలో ఏడు జిల్లాలు, 7,253 చ. కి.మీ. పరిధిలో కొనసాగిన హెచ్ఎండీఏను11 జిల్లాలకు విస్తరించారు. దీంతో హెచ్ఎండీఏ పరిధి 10,475 చ.కి.మీకు పెరిగింది. 2008లో ఎంసీహెచ్‌ను అప్‌గ్రేడ్‌చేస్తూ జీహెచ్ఎంసీ గా, హుడాను హెచ్ఎండీఏగా మార్చారు. అప్పటి నుంచి 650చ.కి.మీ పరిధిలో భవన నిర్మాణాలు, లేఅవుట్లు పర్మిషన్, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణాల అనుమతులను ఇచ్చే అధికారం బల్దియాకు ఉండేది.
మున్సిపల్చట్టం 2018 ప్రకారం శివారు ప్రాంతాల్లో ఏర్పడిన ఏడు కార్పొరేషన్లకు 1000 చ.మీ. స్థలంలో ఏడంతస్తుల వరకు మాత్రమే అనుమతులిచ్చే అధికారం ఉండేది. అంతకుమించిన బిల్డింగులు, లేఅవుట్ల పర్మిషన్లు మాత్రం హెచ్ఎండీఏనే ఇస్తోంది. ఇక ముందు కూడా హెచ్ఎండీఏ మాస్టర్ప్లాన్ప్రకారమే జీహెచ్ఎంసీ విలీన ప్రాంతాలు, ఫ్యూచర్సిటీలోనూ హైరైజ్బిల్డింగుల నిర్మాణాలు, లేఅవుట్లకు అనుమతులు ఇస్తామని హెచ్ఎండీఏ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు.
