- నిరుడు వేసవిలో 650 ఎంజీడీల సరఫరా
- ఉన్న డిమాండ్ 750 ఎంజీడీలు
- తలలు పట్టుకుంటున్న అధికారులు
హైదరాబాద్‌సిటీ, వెలుగు: ఈ సారి వేసవిలో వాటర్‌బోర్డు నగరానికి నీటి సరఫరా పెంచే పరిస్థితి కనిపించడం లేదు. ఔటర్ పరిధిలోని ప్రాంతాలు బోర్డులో విలీనమైనా సరఫరా పెంచలేమంటున్నారు అధికారులు. గతేడాదిలాగే ఉన్న నీటినే సర్దుబాటు చేయాల్సి ఉంటుందంటున్నారు. దీంతో విలీనమైన ప్రాంతాలన్నింటికీ సరిపోయినంత నీటిని అందించే పరిస్థితి కనిపించడం లేదు.
650 ఎంజీడీలు చాలట్లేదు
వాటర్‌బోర్డు గతేడాది ఔటర్ రింగ్‌రోడ్ వరకూ 1,453 చ. కి.మీ. మేర నీటి సరఫరా చేసింది. కానీ ఈసారి బోర్డు పరిధిలో మరో 603 చ. కి.మీ. అంటే ఔటర్వెలుపలి ప్రాంతాలు కూడా కొన్ని కలిశాయి. దీంతో ఈ వేసవిలో ఆయా ప్రాంతాలకు సైతం నీటి సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ప్రధాన జలాశయాల నుంచి సరఫరా చేస్తున్న నీటికంటే ఈసారి ఎక్కువ డ్రా చేసే పరిస్థితి లేదు. గ్రేటర్ లో రోజుకు 600 ఎంజీడీల నీటిని వాటర్‌బోర్డు సరఫరా చేస్తోంది. కానీ, వేసవిలో ఆయా జలాశయాల నుంచి కొంచం ఎక్కువ డ్రా చేసి మరో 50 ఎంజీడీలను అందిస్తోంది. గతేడాది వేసవిలో నీటికి భారీగా డిమాండ్పెరిగినా సరఫరా చేయలేక తిప్పలు పడాల్సి వచ్చింది.
ముఖ్యంగా వెస్ట్ సిటీ, ఔటర్కారిడార్వంటి ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్ల కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రోజుకు 10వేల నుంచి 12వేల ట్యాంకర్లు కూడా బుక్అయ్యాయి. రాత్రింబవళ్లు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసినా అందరికీ అందించలేకపోయారు. ఈ క్రమంలో విలీన ప్రాంతాలకు సరఫరా చేసే పరిస్థితి కనిపించడం లేదు.
750 ఎంజీడీలు కావాలి...
ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. దీనికి తోడు కొత్త కనెక్షన్లు కూడా పెరుగుతున్నాయి. ఏడాదిలో గ్రేటర్లో దాదాపు 50వేల కొత్త కనెక్షన్‌దారులు చేరారు. ప్రస్తుతం బోర్డు పరిధిలో 15.40 లక్షల నీటి కనెక్షన్లున్నాయి. వీరికి కృష్ణా ప్రాజెక్ట్ మూడు దశల నుంచి రోజుకు 280 ఎంజీడీలు, ఎల్లంపల్లి (గోదావరి) మొదటి దశ ద్వారా 165 ఎంజీడీలు, సింగూరు నుంచి 70 ఎంజీడీలు, మంజీరా నుంచి 41 ఎంజీడీలు, జంట జలాశయాల నుంచి 30 ఎంజీడీలు కలిపి 590 ఎంజీడీలు సరఫరా చేస్తున్నారు. వేసవి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మరో 60 ఎంజీడీలు అధికంగా సరఫరా చేసే అవకాశం మాత్రమే ఉంది.
అయితే, కొత్త వాటర్కనెక్షన్లు ఇంకా పెరుగుతుండడం, విలీన ప్రాంతాల వారికీ నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఉండడంతో నీటి సమస్యలు తప్పేలా లేవు. మొత్తంగా రోజుకు 750 ఎంజీడీల నీటి అవసరం ఉంటుందని, దీన్ని ఎలా ఎదుర్కోవాలా అని బోర్డు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక వచ్చే ఏడాది ఈ డిమాండ్పెరిగి 830 ఎంజీడీలకు చేరుతుందని, ప్రత్యామ్నాయం లేకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందంటున్నారు.
