T20 World Cup 2026: మనకు మంచి జట్టు ఉంది.. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాను ఓడించాలి: దిగ్గజ క్రికెటర్

T20 World Cup 2026: మనకు మంచి జట్టు ఉంది.. వరల్డ్ కప్ ఫైనల్లో ఇండియాను ఓడించాలి: దిగ్గజ క్రికెటర్

2026 టీ20 వరల్డ్ కప్ ను భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ టోర్నమెంట్‌ జరగనుంది. టోర్నమెంట్ లో భాగంగా తొలి మ్యాచ్ ఫిబ్రవరి 7న పాకిస్తాన్- నెదర్లాండ్ మధ్య జరగుతుంది. వరల్డ్ కప్ కు నెల కంటే తక్కువ సమయం ఉండడంతో ఫ్యాన్స్ ఈ మెగా టోర్నీ కోసం ఆతృత్తగా ఎదురు చూస్తున్నారు. సొంతగడ్డపై జరగనుండడంతో టీమిండియా ఈ టోర్నీలో టైటిల్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. టోర్నీకి ముందు సౌతాఫ్రికా దిగ్గజ క్రికెటర్ గ్రేమ్ స్మిత్ వరల్డ్ కప్ ఫైనల్ కు ఇండియా, సౌతాఫ్రికా వెళ్తాయని అంచనా వేశాడు. అంతేకాదు సౌతాఫ్రికా ఫైనల్లో ఇండియాను ఓడించాలని ఆశాభావం వ్యక్తం చేశాడు.        

స్మిత్ మాట్లాడుతూ ఇలా అన్నాడు.. "ఇండియన్ క్రికెట్ టాలెంట్ అద్భుతంగా ఉంది. పైగా ఇండియా స్వదేశంలో వరల్డ్ కప్ ఆడుతుంది. గంభీర్ కోచ్ గా భారత జట్టు దూసుకెళ్తోంది. వరల్డ్ కప్ కు ఖచ్చితంగా టీమిండియా టైటిల్ ఫేవరేట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండియా సెమీస్ కు రాకపోతే నేను చాలా ఆశ్చర్యానికి గురవుతాను. ఖచ్చితంగా మనం ఫైనల్‌లో ఇండియాను ఓడించాలని కోరుకుంటున్నాను.

శుక్రి [కాన్రాడ్] కోచ్ గా సౌతాఫ్రికాకు మంచి టీ20 జట్టు ఉందని ఆశిస్తున్నాను. ప్రస్తుత జట్టుకు వరల్డ్ కప్ గెలిచే సామర్ధ్యముంది. సౌతాఫ్రికా మిడిల్ ఆర్డర్ లో స్పిన్ ఆడగలిగే నాణ్యమైన ప్లేయర్లు ఉన్నారు. ఈ ప్రపంచ కప్ సౌతాఫ్రికాపై మంచి అనుభవాలను మిగిలిస్తుందని ఆశిస్తున్నాను". అని స్మిత్ హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నాడు. 

తొలిసారి 20 జట్లతో టీ20 వరల్డ్ కప్: 

క్రికెట్ ప్రపంచంలో అత్యంత రసవత్తరంగా, ఫ్యాన్స్ థ్రిల్లింగ్ గా ఫీలయ్యే ఇండియా-పాక్ జట్ల మధ్య మ్యాచ్ ఫిబ్రవరి 15న కొలంబోలో జరగనుంది. ఇండియా, పాకిస్తాన్ , అమెరికా(USA), నమీబియా, నెదర్లాండ్స్  ఒకే గ్రూపులో ఉన్నాయి. ఈసారి ఈ మెగా టోర్నీలో 20 జట్లు తలపడనున్నాయి. భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌, యూఏఈ, ఒమన్‌, వెస్టిండీస్‌, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా,  న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఇంగ్లాండ్‌, నెదర్లాండ్స్‌, ఇటలీ, నేపాల్‌, పాకిస్థాన్‌ జట్లు టోర్నమెంట్ లో  భాగం కానున్నాయి. 

►ALSO READ | BBL 2025-26: బిగ్ బాష్ లీగ్‌లో పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెటర్‌.. స్లో గా ఆడడంతో ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్

భారత్‌లో జరిగే మ్యాచ్ లు 5 స్టేడియాల్లో జరుగుతాయి. అహ్మదాబాద్‌, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, ముంబయి స్టేడియాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇక శ్రీలంక లో 3 వేదికల్లో నిర్వహించనున్నారు. ప్రారంభ, ఫైనల్‌ మ్యాచ్‌లు అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో నిర్వహించనున్నారు.