BBL 2025-26: బిగ్ బాష్ లీగ్‌లో పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెటర్‌.. స్లో గా ఆడడంతో ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్

BBL 2025-26: బిగ్ బాష్ లీగ్‌లో పరువు పోగొట్టుకున్న పాక్ క్రికెటర్‌.. స్లో గా ఆడడంతో ఇన్నింగ్స్ మధ్యలోనే రిటైర్డ్ ఔట్

బిగ్ బాష్ లీగ్ లో పాకిస్థాన్ క్రికెటర్ మహమ్మద్ రిజ్వాన్ కు ఘోర అవమానం జరిగింది. మ్యాచ్ ఆడుతుండగానే అతడి అవసరం లేదని మధ్యలో రిటైర్ చేయడం సంచలనంగా మారింది. సోమవారం (జనవరి 12) సిడ్నీ థండర్ తో జరుగుతున్న మ్యాచ్ లో మెల్బోర్న్ రెనెగేడ్స్ ప్లేయర్ మహమ్మద్ రిజ్వాన్ వేగంగా ఆడడంలో విఫలమయ్యాడు. 26 బంతులాడిన ఈ పాక్ బ్యాటర్ కేవలం 23 పరుగులు మాత్రమే చేశాడు. రిజ్వాన్ స్లో బ్యాటింగ్ కు మెల్బోర్న్ జట్టు యాజమాన్యం విసిగిపోయింది. సదర్లాండ్ లాంటి పవర్ హిట్టర్ బ్యాటింగ్ చేయాల్సి ఉన్నా రిజ్వాన్ నత్త నడకన బ్యాటింగ్ చేశాడు.     

డెత్ ఓవర్లలో కూడా బ్యాట్ ఝులిపించలేకపోవడంతో చేసేది ఏమీ లేక రిటైర్డ్ ఔట్ చేశారు. దీంతో ఈ పాక్ స్టార్ బ్యాటర్ కు స్టేడియంలో ఊహించని అవమానం జరిగింది. ఈ ఒక్క మ్యాచ్ లోనే కాదు టోర్నీ మొత్తం ఈ పాక్ బ్యాటర్ పేలవంగా బ్యాటింగ్ చేశాడు. ఇప్పటివరకు ఎనిమిది మ్యాచ్‌ల్లో 101.82 స్ట్రైక్ రేట్‌తో 167 పరుగులు చేశాడు. ఒక వైపు పరుగులు చేయడంలో.. మరోవైపు దూకుడుగా ఆడడంలో విఫలమయ్యాడు. పాకిస్థాన్ టీ20 జట్టులో స్థానం కోల్పోయిన రిజ్వాన్.. బిగ్ బాష్ లీగ్ తొలిసారి ఆడుతున్నాడు. ఎన్నో అంచనాల మధ్య  మెల్బోర్న్ రెనెగేడ్స్ జట్టులోకి వచ్చి ప్రతి మ్యాచ్ లో నిరాశపరిచాడు. 

ALSO READ : సుందర్‌తో తమిళ్‌లో మాట్లాడిన రాహుల్..

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన మెల్బోర్న్ రెనెగేడ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది.  హసన్ ఖాన్ 31 బంతుల్లో 46 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఓపెనర్ జోష్ బ్రౌన్ 35 పరుగులు చేసి రాణించాడు.  థండర్ తరఫున డేవిడ్ విల్లీ, ర్యాన్ హాడ్లీ, వెస్ అగర్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. థండర్ ఇన్నింగ్స్ సమయంలో వర్షం పడడంతో లక్ష్యాన్ని 16 ఓవర్లలో 140 పరుగులకు సవరించారు. థండర్స్ ఈ లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసి గెలిచింది. క్రిస్ గ్రీన్ 13 బంతుల్లోనే 34 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించాడు.