న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా కివీస్ తో ముగిసిన ఈ మ్యాచ్ లో గిల్ సేన 4 వికెట్ల తేడాతో నెగ్గి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్ జరుగుతున్నప్పుడు వికెట్ కీపర్ కెఎల్ రాహుల్, స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మధ్య జరిగిన తమిళ సంభాషణ చర్చనీయాంశంగా మారింది. ఈ సమయంలో కామెంటేటర్ సంజయ్ బంగర్ చేసిన ప్రకటన వివాదానికి దారితీసింది. మ్యాచ్ కీలక దశలో సుందర్‌కు రాహుల్ బౌలింగ్ ఎలా వేయాలో చిట్కాలు ఇస్తూ తమిళంలో మాట్లాడుతూ కనిపించాడు.
ఈ సమయంలో కామెంటరీ చేస్తున్న వరుణ్ ఆరోన్, సంజయ్ బంగర్ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. న్యూజిలాండ్ ఓపెనర్లు డెవాన్ కాన్వే, హెన్రీ నికోల్స్ తొలి వికెట్ కు మంచి ఆరంభం ఇచ్చారు. ఈ సమయంలో ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడగొట్టడానికి సుందర్ బౌలింగ్ కు వచ్చాడు. వికెట్ కీపింగ్ చేస్తున్న రాహుల్ తమిళంలో బంతి వేగాన్ని తగ్గించమని సూచించాడు. సుందర్ మాతృభాష తమిళం కాబట్టి రాహుల్ తమిళంలో మాట్లాడి సుందర్ కు వివరించాడు.
►ALSO READ | Harshit Rana: ఆ కారణంగానే టీమిండియాలో నాకు వరుస ఛాన్స్‌లు.. అసలు నిజాన్ని బయటపెట్టిన హర్షిత్ రానా
స్టంప్ మైక్‌లో రాహుల్ తమిళం మాట్లాడుతున్నట్టు వినిపించగానే కామెంటరీ చేస్తున్న వరుణ్ ఆరోన్ తన కో కామెంటేటర్ సంజయ్ బంగర్‌ను ఇలా అడిగాడు. "వాషింగ్టన్ సుందర్‌తో కేఎల్ రాహుల్ తమిళంలో మాట్లాడాల్సి వచ్చింది. సుందర్ వేగంగా బౌలింగ్ చేయవద్దని రాహుల్ చెబుతున్నాడు. దీనికి సమాధానమిస్తూ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ “నేను జాతీయ భాష (హిందీ)ని ఎక్కువగా నమ్ముతాను”. అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆరోన్ వెంటనే "నేను ప్రాంతీయ భాషలను మాత్రమే నమ్ముతానని ఎక్కడ చెప్పాను?" అని సమాధానమిచ్చాడు.
సంజయ్ బంగర్ పరోక్షంగా హిందీని 'జాతీయ భాష' అని ప్రస్తావించడం వివాదానికి దారితీసింది. వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం దేశానికి 'జాతీయ భాష' లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 8 ప్రకారం హిందీ, ఇంగ్లీషులకు కేంద్ర ప్రభుత్వ పరిపాలనలో ఉపయోగించే 'అధికారిక భాషలు' గా హోదా ఉంది. అంతేకానీ వాటికి జాతీయ భాష హోదా లేదు. రాహుల్ తమిళంలో మాట్లాడితే సమర్థించకుండా బంగర్ 'జాతీయ భాష' హిందీ అని గుర్తు చేస్తూ వివాదానికి కారణమయ్యాడు.
Sanjay Bangar and Varun Aaron fighting over language in commentary 😭 pic.twitter.com/Yafw2DtH1D
— ` (@justKohlitweetz) January 11, 2026
