తమిళనాడులో ఘోరం జరిగింది.. సొంత చెల్లిని చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడు ఓ అన్న. తమిళనాడులోని రామనాథపురం జిల్లా ఉచ్ఛిపులి సమీపంలోని నాగాచ్చిలో జరిగింది ఈ ఘటన. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి నాగాచ్చి గ్రామానికి చెందిన శశికళ అదే గ్రామానికి చెందిన పాండి కొన్నేళ్లుగా ప్రేమించుకున్నారు.పాండి కుటుంబం శశికళ ఇంటికి పెళ్లి చూపులకు వెళ్లగా.. ఆమె తల్లిదండ్రులు నిరాకరించారు. ఆ తర్వాత ఐదేళ్ల క్రితం శశికళను బంధువైన మురుగన్ కు ఇచ్చి పెళ్లి చేశారు.
శశికళ మురుగన్ లకు నాలుగేళ్ళ కూతురు ఉంది. అయితే.. పెళ్లి తర్వాత కూడా శశికళ, పాండి మధ్య ప్రేమ కొనసాగింది. ఒకసారి శశికళ ఇంటి నుంచి వెళ్లిపోవడంతో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను భర్త దగ్గరికి పంపించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత 2026 జనవరి 17న శశికళ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలొచ్చాయి. శశికళ మరణవార్త విని మనస్థాపం చెందిన పాండి బెంగుళూరులో ధర్మపురి దగ్గర ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.మొదట ఇది డబుల్ సూసైడ్ గా భావించారు అందరు. కానీ.. పోలీసుల దర్యాప్తులో కేసు మలుపు తిరిగింది.
పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు:
పోలీసుల విచారణలో శశికళది ఆత్మహత్య కాదని.. హత్య అని తేలింది. విదేశాల్లో పనిచేస్తున్న శశికళ అన్న అజిత్ హత్య చేసినట్లు తెలిపారు పోలీసులు. శశికళ పాండిల ప్రేమ పెళ్లయ్యాక కూడా కొనసాగుతోందని తెలుసుకున్న అజిత్ జనవరి 17న రహస్యంగా మధురైకి వచ్చాడని.. పాండితో సంబంధం తెంచుకోవాలని హెచ్చరించాడని తెలిపారు పోలీసులు. ఈ క్రమంలో అన్న చెల్లెలు మధ్య వాగ్వాదం జరిగిందని.. అజిత్ శశికళను గొంతు నులిమి చంపేశాడని తెలిపారు పోలీసులు.
ఆ తర్వాత శశికళకు ఉరి వేసి ఆత్మహత్యగా చిత్రీకరించి విదేశాలకు వెళ్లాడని తెలిపారు పోలీసులు. ఈ కుట్రలో శశికళ భర్త మురుగన్, అజిత్ ఫ్రెండ్స్ దినేష్, రాజేష్ ల సహకారం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మురుగన్, దినేష్ లను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అజిత్ ను ఇండియాకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నామని.. పరారీలో ఉన్న మరో నిందితుడు రాజేష్ కోసం గాలిస్తున్నామని తెలిపారు పోలీసులు.
