కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోన్-అప్స్’. ఈ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణతో కలిసి యశ్ కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మొదట ఈ సినిమాను మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అయితే, లేటెస్ట్గా (మార్చి 4న) ఈ చిత్రం అనూహ్యంగా వాయిదా వేస్తూ ప్రేక్షకులకు షాక్ ఇచ్చారు మేకర్స్. మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ క్రమంలో, ‘టాక్సిక్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మరియు భారతీయ భాషల్లో 2026 జూన్ 4న థియేటర్లలో విడుదల కానుందని కొత్త డేట్ అనౌన్స్ చేశారు.
మేకర్స్ విడుదల వాయిదాపై అధికారిక ప్రకటన చేస్తూ.. “టాక్సిక్ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాం. అందులో భాగంగానే ఈ సినిమాను కన్నడ మరియు ఇంగ్లీష్ భాషల్లో చిత్రీకరించి, గ్రాండ్ వరల్డ్‌వైడ్ థియేట్రికల్ రిలీజ్‌కు ప్లాన్ చేశాము. మార్చి 19న మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకురావడానికి ఎంతో ఆతృతగా ఎదురుచూశాం. విడుదల వాయిదా వేయాల్సి రావడం మాకు కూడా ఎంతో బాధ కలిగిస్తోంది.
అయితే, ముఖ్యంగా మధ్యప్రాచ్య దేశాల్లో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యంకాలేదు. ప్రేక్షకుల భావోద్వేగాలను గౌరవిస్తూ, పరిస్థితులను సమగ్రంగా పరిశీలించిన తర్వాత మా విడుదల తేదీని వాయిదా వేయాలని కఠినమైన కానీ అవసరమైన నిర్ణయం తీసుకున్నాము.
మీ అవగాహనకు, సహనానికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ ప్రేమ, మద్దతు ఎల్లప్పుడూ మాతోనే ఉంటాయని ఆశిస్తున్నాము. ‘టాక్సిక్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఇంగ్లీష్ మరియు భారతీయ భాషల్లో 2026 జూన్ 4న థియేటర్లలో విడుదల అవుతుంది” అని మేకర్స్ తెలిపారు.
Toxic : A Fairy Tale for Grown-Ups - in Cinemas Worldwide on 4 June 2026 pic.twitter.com/TlLgyzrKsF
— Yash (@TheNameIsYash) March 4, 2026
ఇక ఇప్పుడు ఇండియన్ మూవీ లవర్స్, బాక్సాఫీస్ ఎక్స్ పర్ట్స్ ఫోకస్ మొత్తం ధురంధర్ 2పైనే ఉంది. ఈ సినిమా మార్చి 19న పాన్ ఇండియానే కాదు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. లేటెస్ట్గా టాక్సిక్ తప్పుకోవడంతో సోలోగా బాక్సాఫీస్ బరిలోకి దిగబోతుంది.
