అమెరికా టెక్ దిగ్గజం మెటా ప్లాట్‌ఫామ్స్ అధినేత మార్క్ జూకర్‌బర్గ్ రియల్ ఎస్టేట్ ప్రపంచంలో మరో సంచలనం సృష్టించారు. తన భార్య ప్రిసిల్లా చాన్‌తో కలిసి మయామిలోని అత్యంత విలాసవంతమైన ఇండియన్ క్రీక్ ఐలాండ్ లో ఒక భారీ వాటర్‌ఫ్రంట్ మాన్షన్‌ను కొన్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్స్ ప్రకారం దీని విలువ ఏకంగా 170 మిలియన్ డాలర్లు. అంటే మన భారతీయ కరెన్సీ లెక్కల ప్రకారం చూస్తే, దీని విలువ దాదాపు రూ.1,418 కోట్లకు పైమాటే. మయామి-డేడ్ కౌంటీ చరిత్రలోనే ఇది అత్యంత ఖరీదైన రియల్టీ లావాదేవీగా సరికొత్త రికార్డును సృష్టించింది. దీనికి ముందు 2025లో నమోదైన 120 మిలియన్ డాలర్ల ప్రాపర్టీ సేల్ రికార్డును జూకర్‌బర్గ్ ఈ కొనుగోలుతో చెరిపివేశారు.
ప్రముఖ సెలబ్రిటీ ప్లాస్టిక్ సర్జన్ ఆరోన్ రోలిన్స్, అతని భార్య మెరైన్ రోలిన్స్ నుంచి జూకర్‌బర్గ్ ఈ ఇంటిని కొనుగోలు చేశారు. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం దాదాపు రూ.19.2 లక్షల కోట్ల సంపద కలిగిన జూకర్‌బర్గ్, గత కొన్ని వారాలుగా ఈ ప్రాంతంలో తనకు నచ్చిన ఆస్తి కోసం అన్వేషిస్తున్నారు. మార్చి 2వ తేదీన ఈ భారీ డీల్ అధికారికంగా ముగిసింది. కాలిఫోర్నియాలో ప్రతిపాదిత బిలియనీర్స్ ట్యాక్స్ పై చర్చ జరుగుతున్న వేళ.. సిలికాన్ వ్యాలీకి చెందిన దిగ్గజాలు సౌత్ ఫ్లోరిడా వైపుకు వెళ్లటం ఆసక్తికరంగా మారింది.
ఈ ఇండియన్ క్రీక్ ఐలాండ్‌ను "బిలియనీర్ బంకర్" అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ నివసిస్తున్న వారందరూ ప్రపంచ స్థాయి ప్రముఖులే. జూకర్‌బర్గ్‌కు పొరుగున ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్ వంటి రాజకీయ, వ్యాపార దిగ్గజాలు ఉండబోతున్నారు. ఇప్పటికే ఆల్ఫాబెట్ కో-ఫౌండర్ లారీ పేజ్ మయామి ప్రాంతంలో రూ.1,568 కోట్లు వెచ్చించి మూడు ప్రాపర్టీలను కొన్న సంగతి తెలిసిందే. అలాగే సెర్గీ బ్రిన్ కూడా రూ.417 కోట్ల విలువైన నివాసాన్ని సొంతం చేసుకునే పనిలో ఉన్నారు. టెక్ ప్రపంచంలోని దిగ్గజాలు వరుసగా మయామికి క్యూ కడుతుండటం అక్కడి రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు మరింత జోష్ నింపుతోంది.
మార్క్ జూకర్‌బర్గ్‌కు ఇప్పటికే అమెరికా అంతటా అనేక ఖరీదైన ఆస్తులు ఉన్నాయి. కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో, లేక్ తాహోతో పాటు వాషింగ్టన్ డీసీ, హవాయిలోని కవాయ్ ద్వీపంలో ఆయనకు భారీ ఎస్టేట్లు ఉన్నాయి. తాజాగా కొనుగోలు చేసిన ఈ మయామి ఇల్లు ఆయన లగ్జరీ పోర్ట్‌ఫోలియోలో ఒకటిగా నిలిచింది. కేవలం నివాసం కోసమే కాకుండా.. పన్ను ప్రయోజనాలు, భద్రత దృష్ట్యా కూడా బిలియనీర్లు ఇలాంటి ప్రాంతాలను ఎంచుకుంటున్నట్లు విశ్లేషకులు అంటున్నారు. రూ.1,400 కోట్లకు పైగా విలువైన ఈ ఇల్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
