HCA నిధుల మళ్లింపు ఆరోపణలు అవాస్తవం.. కోర్టు ఆదేశాల మేరకే విశాకకు చెల్లింపుల ప్రక్రియ: ప్రెసిడెంట్ అమర్‌‌నాథ్

HCA నిధుల మళ్లింపు ఆరోపణలు అవాస్తవం.. కోర్టు ఆదేశాల మేరకే విశాకకు చెల్లింపుల ప్రక్రియ: ప్రెసిడెంట్ అమర్‌‌నాథ్

హైదరాబాద్, వెలుగు: ఉప్పల్ క్రికెట్ స్టేడియం స్పాన్సర్‌‌షిప్ వ్యవహారంలో విశాక ఇండస్ట్రీస్‌‌కు అనధికారికంగా నిధులు మళ్లించారనే ఆరోపణలను హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌‌సీఏ)  ప్రెసిడెంట్ అమర్‌‌నాథ్‌‌ ఖండించారు. చెల్లింపు ప్రక్రియ పూర్తిగా కోర్టు ఉత్తర్వుల మేరకే జరుగుతోందని స్పష్టం చేశారు. 

హెచ్‌‌సీఏ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నిధులను కమర్షియల్‌‌ కోర్టు ఫ్రీజ్ చేసిందని, ఆ మొత్తం ఇంకా విశాక సంస్థ అకౌంట్‌‌లోకి చేరనేలేదని మంగళవారం జింఖానా గ్రౌండ్స్‌‌లో హెచ్‌‌సీఏ జాయింట్ సెక్రటరీ బసవరాజు, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ శివలాల్ యాదవ్‌‌తో కలిసి అమర్‌‌నాథ్ మీడియాకు తెలిపారు. 2004లో ఉప్పల్ స్టేడియం నిర్మాణ సమయంలో హెచ్‌‌సీఏ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విశాక ముందుకొచ్చి రూ. 6.50 కోట్ల స్పాన్సర్‌‌షిప్‌‌తో ఆదుకుందని అమర్‌‌నాథ్ గుర్తుచేశారు.

‘ఆ సమయంలో కుదిరిన ఒప్పందం ప్రకారం స్టేడియానికి విశాక ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అని పేరు పెట్టాలి. స్టేడియంలో అడ్వర్‌‌‌‌టైజ్‌‌మెంట్స్ ఇతర  హక్కులు కల్పిస్తూ  చేసుకున్న ఒప్పందాన్ని  2011లో అప్పటి ప్రెసిడెంట్ అర్షద్ అయూబ్ ఏకపక్షంగా రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయమే వివాదానికి అసలు కారణం. దీనిపై విశాక సంస్థ ఆర్బిట్రేషన్ ట్రైబ్యునల్‌‌ను ఆశ్రయించింది.  ఒప్పందం రద్దు చట్టవిరుద్ధమని పేర్కొన్న ట్రైబ్యునల్ విశాకకు రూ. 25.92 కోట్లను 18 శాతం వడ్డీతో చెల్లించాలని 2016లోనే తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హెచ్‌‌సీఏ దాఖలు చేసిన పిటిషన్లను కమర్షియల్ కోర్టు, హైకోర్టుతో పాటు 2025లో సుప్రీంకోర్టు కూడా కొట్టివేసింది’ అని పేర్కొన్నారు. 

ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతోనే..
తమ ఉత్తర్వులను పట్టించుకోకపోవడంతో 2025 నవంబర్ 24న కమర్షియల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలతో హెచ్‌‌సీఏ ఖాతాలను కెనరా బ్యాంక్‌‌ ఫ్రీజ్ చేసిందని అమర్‌‌‌‌నాథ్ చెప్పారు. తదుపరి  ఉత్తర్వుల మేరకు రూ. 68 కోట్ల మొత్తాన్ని బ్యాంకు డీడీల రూపంలో కోర్టులో డిపాజిట్ చేసిందన్నారు. తాను ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక్క చెక్కు మీద కూడా సంతకం చేయలేదని ఆయన స్పష్టం చేశారు. 

కోర్టు ఆదేశాలు, సింగిల్ మెంబర్ కమిటీ హెడ్ జస్టిస్ నవీన్ రావు సూచనల మేరకే హెచ్‌‌సీఏ నడుచుకుంటోందని వివరించారు. ఈ వ్యవహారంతో మంత్రి వివేక్‌‌ వెంకటస్వామికి కూడా ఎలాంటి సంబంధం లేదని,  కేవలం రాజకీయ కక్షతోనే తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని హెచ్‌‌సీఏ ప్రతినిధులు స్పష్టం చేశారు. కోర్టు తీర్పు ప్రకారం విశాకకు వెళ్లబోయే మొత్తాన్ని తిరిగి క్రికెట్ అభివృద్ధికి కేటాయించాలని తాము ఆ సంస్థకు విజ్ఞప్తి చేస్తామని తెలిపారు.

2016లోనే పరిష్కారానికి మొగ్గు చూపాం: విశాక
ఈ వ్యవహారంపై విశాక ఇండస్ట్రీస్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. కోర్టు తీర్పు ప్రకారమే ఈ ప్రక్రియ జరుగుతోందని తెలిపింది. ‘నిజానికి 2016లో వడ్డీతో కలిపి చెల్లించాల్సిన రూ. 25.92 కోట్ల కంటే తక్కువగా.. అంటే రూ. 17.50 కోట్లకే ఈ వివాదాన్ని కోర్టు వెలుపల పరిష్కరించుకోవడానికి విశాక అంగీకరించింది. 

ఈ మేరకు కోర్టులో జాయింట్ మెమో కూడా దాఖలు చేశారు. కానీ అర్షద్ అయూబ్ ఆ ఒప్పందం నుంచి వెనక్కి తగ్గడంతోనే వివాదం ఇంత దూరం వచ్చింది’ అని విశాక తన ప్రకటనలో పేర్కొంది. ఇక, హెచ్‌‌సీఏ గత ప్రెసిడెంట్ తొలగింపు అంశంలో విశాకకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. హెచ్‌‌సీఏ అంబుడ్స్‌‌మన్ తీసుకున్న నిర్ణయం ప్రకారమే తాను ప్రెసిడెంట్‌‌గా బాధ్యతలు చేపట్టానని అమర్‌‌‌‌నాథ్ పేర్కొన్నారు.