Rajamouli: థియేటర్లలో ఆడియన్స్ వణికిపోవాల్సిందే.. రామ్ చరణ్'RC17' ఓపెనింగ్ సీన్‌ను రివీల్ చేసిన రాజమౌళి !

Rajamouli: థియేటర్లలో ఆడియన్స్ వణికిపోవాల్సిందే.. రామ్ చరణ్'RC17' ఓపెనింగ్ సీన్‌ను రివీల్ చేసిన రాజమౌళి !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,  క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ అంటే ఆ అంచనాలే వేరు. గతంలో వీరిద్దరి కలయికతో వచ్చిన చిత్రం 'రంగస్థలం'. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడమే కాకుండా.. రామ్ చరణ్ లోని నటుడిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో మరో చిత్రం రెడీ అవుతోంది. ఈ 'RC17' మూవీకి సంబంధించిన వర్క్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఈసినిమాకు సంబంధించిన ఆప్డేట్ ఒకటి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.

రాజమౌళి ఇచ్చిన షాకింగ్ అప్‌డేట్!

ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు 'వారణాసి' మూవీ షూటింగ్ లో ఉన్న దర్శకధీరుడు రాజమౌళి ఫుల్ బిజీ ఉన్నారు. అయితే ఇటీవల ఆయన ఒక ఇంటర్యూలో ' RC17' చిత్రం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీ ఓపెనింగ్ సీన్ గురించి రీవీల్ చేశారు.  సుకుమార్-, చరణ్ సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. దాని గురించి నేను ఇప్పుడే చెబితే సుకుమార్‌కు హార్ట్ ఎటాక్ వస్తుంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను, ఆ సీన్ చూస్తున్నప్పుడు థియేటర్లలో ఆడియన్స్ సీట్లలో వణికిపోతారు. అది అంత హార్డ్ హిట్టింగ్‌గా ఉండబోతోంది అని చెప్పుకొచ్చారు. దీంతో రాజమౌళి లాంటి దర్శకుడు ఒక ఓపెనింగ్ సీన్ గురించి ఇంతలా చెబుతున్నారంటే.. సుకుమార్ ఈసారి ఎంతటి భయంకరమైన , అద్భుతమైన ఐడియాతో వస్తున్నారో అని మెగా ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు మొదలుపెట్టారు.

షూటింగ్ ఎప్పుడంటే?

ప్రస్తుతం రామ్ చరణ్ తన 16వ చిత్రంపై దృష్టి పెట్టారు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' (Peddi) షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం మార్చి 27, 2026న విడుదల కానుంది. ఆ తర్వాత కొద్దిరోజుల విరామం తీసుకుని, జూలై 2026 నుండి రామ్ చరణ్ సుకుమార్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నారు. ప్రస్తుతం సుకుమార్ ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమై ఉన్నారు.

'RC17' పై అంచనాలు

సుకుమార్ సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా విభిన్నంగా ఉంటుంది. 'రంగస్థలం'లో చిట్టిబాబుగా చరణ్ చూపించిన నటనకు మించి ఈసారి ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించే అవకాశం ఉంది. ఈ కాంబో మళ్ళీ సెట్స్ పైకి వెళ్తోందని తెలియగానే సోషల్ మీడియాలో  మెగా మాస్ లోడింగ్ అంటూ పోస్ట్‌లు వెల్లువెత్తుతున్నాయి. రాజమౌళి చెప్పినట్లుగా ఆ 'హార్డ్ హిట్టింగ్' ఓపెనింగ్ సీన్ ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే..

►ALSO READ | Prabhas: 'ది రాజా సాబ్' పైరసీ కలకలం.. ఏకంగా రెస్టారెంట్ టీవీల్లోనే సినిమా ప్రదర్శన!