Vijay Vs CBI: దళపతిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. కరూర్ విషాదంపై 6 గంటలపాటు విచారణ!

Vijay Vs CBI: దళపతిపై సీబీఐ ప్రశ్నల వర్షం.. కరూర్ విషాదంపై 6 గంటలపాటు విచారణ!

తమిళనాట రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న కరూర్ తొక్కిసలాట ఘటనపై సీబీఐ తన దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని విచారించింది. ఈ నేపథ్యంలోనే సోమవారం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో టీవీకే చీఫ్, నటుడు విజయ్ విచారణకు హాజరయ్యారు. ఉదయం ప్రారంభమైన ఈ విచారణ దాదాపు ఆరున్నర గంటల పాటు కొనసాగింది. విచారణలో సీబీఐ అధికారులు విజయ్ పై ప్రశ్నల వర్షం కురిపించారు.

ఆ విషాదం వెనుక కారణాలేంటి?

సెప్టెంబర్ 27, 2025న కరూర్‌లో నిర్వహించిన విజయ్ బహిరంగ సభ పెను విషాదానికి దారితీసిన సంగతి తెలిసిందే. కేవలం 10,000 మందికి మాత్రమే అనుమతి ఉన్న చోట, దాదాపు 30,000 మందికి పైగా జనం తరలివచ్చారు. విజయ్ రాక ఏడు గంటలు ఆలస్యం కావడంతో, ఒక్కసారిగా అభిమానులు ముందుకు దూసుకురావడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 9 మంది చిన్నారులు, 18 మంది మహిళలతో సహా మొత్తం 41 మంది ప్రాణాలు కోల్పోయారు.

 సీబీఐ అడిగిన కీలక ప్రశ్నలు? 

 విచారణలో భాగంగా విజయ్‌ను  సీబీఐ అధికారులు పలు కీలక ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  బహిరంగ సభ ఏర్పాటు చేసిన ప్రాంగణానికి నిర్ణీత సమయం కంటే ఏడు గంటలు ఆలస్యంగా రావడానికి గల కారణాలేంటి? భారీ సంఖ్యలో జనం వస్తారని అంచనా వేయలేదా? సభ నిర్వహణ బాధ్యతలు ఎవరివి? . తొక్కిసలాట జరిగిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? ఆ సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు?.  ఎగ్జిట్ పాయింట్లు వంటి కనీస వసతులపై పార్టీ వాలంటీర్లు జాగ్రత్తలు తీసుకున్నారా? వంటి అంశాలపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే  జిల్లా యంత్రాంగం వైఫల్యం వల్లే ఈ అపశ్రుతి జరిగిందని, తాను విచారణకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని తెలిపినట్లు సమాచారం.

రాజకీయ వేడి ..

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో విజయ్‌ను సీబీఐ విచారించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది కేంద్రం చేస్తున్న రాజకీయ కక్షసాధింపు చర్య అని DMK నేతలు విమర్శిస్తుండగా, విజయ్ అభిమానులు ఢిల్లీ కార్యాలయం బయట భారీగా మోహరించి తమ మద్దతును ప్రకటించారు.

►ALSO READ | Rajamouli: థియేటర్లలో ఆడియన్స్ వణికిపోవాల్సిందే.. రామ్ చరణ్'RC17' ఓపెనింగ్ సీన్‌ను రివీల్ చేసిన రాజమౌళి !

కేసు తీవ్రత దృష్ట్యా, సోమవారం విచారణ ముగిసిన వెంటనే అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. రేపు (మంగళవారం జనవరి 13న ) కూడా విచారణకు హాజరుకావాలని విజయ్‌కు నోటీసులు ఇచ్చారు. ఇప్పటికే కరూర్ జిల్లా కలెక్టర్ థంగవేల్, ఎస్పీ జోస్‌లను విచారించిన సీబీఐ, విజయ్ ఇచ్చే సమాచారాన్ని వారి స్టేట్‌మెంట్లతో సరిపోల్చనుందని సమాచారం. ఇప్పుడు సీబీఐ విచారణ వ్యవహారం సినీ , రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.