వనపర్తి, వెలుగు : వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని ఒక గ్రామంలో ప్రేమ పేరుతో 16 ఏండ్ల బాలికను మోసగించిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. అదే గ్రామానికి చెందిన, ముగ్గురు పిల్లలున్న ఒక వ్యక్తి సదరు బాలికను ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని నమ్మించి లోబరుచుకున్నాడు. బాలిక గర్భవతి కావడంతో నిందితుడు ముఖం చాటేయగా, ఈ విషయంపై గ్రామంలోని కొందరు పెద్దలు కుల పంచాయితీ నిర్వహించారు.
చట్టపరంగా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సింది పోయి, బాలిక శీలానికి వెల కడుతూ నిందితుడు రూ.1.50 లక్షల జరిమానా చెల్లించాలని తీర్పునిచ్చారు. కాగా, ఇందులో కేవలం రూ.50 వేలు మాత్రమే ఇచ్చి మిగతా మొత్తాన్ని ఇవ్వకుండా నిందితుడు తప్పించుకుంటున్నాడు. అయితే బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోకుండా, ఇలా అక్రమంగా కుల పంచాయితీలు నిర్వహించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
