- అర్హులకు పథకాలను చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదే
- కొత్త కలెక్టర్లతో మంత్రి పొంగులేటి
హైదరాబాద్, వెలుగు: ‘‘పేదల సంక్షేమమే లక్ష్యంగా పని చేయండి, అర్హులకు సంక్షేమ పథకాలను చేర్చాల్సిన బాధ్యత కలెక్టర్లదే, మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోండి” అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సూచించారు. రెండేండ్లలో ప్రజా ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. మంగళవారం సచివాలయంలో జోగులాంబ గద్వాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, మెదక్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ తదితర జిల్లాల నూతన కలెక్టర్లతో మంత్రి భేటీ అయ్యి మాట్లాడారు.
ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని సూచించారు. సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ప్రజల అవసరాలను అర్థం చేసుకొని పని చేయాలని తెలిపారు. ఐఏఎస్ అధికారుల కెరీర్లో కలెక్టర్లుగా పని చేయటమే అత్యంత కీలకమైన అవకాశమన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుంటే అన్ని అంశాలపై అవగాహన వస్తుందన్నారు.
