పేదల ఇండ్లు కూల్చడమే సీఎం పనిగా పెట్టుకున్నరు : ఎన్వీ సుభాష్ 

పేదల ఇండ్లు కూల్చడమే సీఎం పనిగా పెట్టుకున్నరు : ఎన్వీ సుభాష్ 
  • బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ 

హైదరాబాద్, వెలుగు:  పేదల ఇండ్లను కూల్చడమే సీఎం రేవంత్​రెడ్డి పనిగా పెట్టుకున్నారని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ.సుభాష్ మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, 26 నెలలు గడుస్తున్నా ఎన్నికల హామీలను అమలు చేయడం లేదన్నారు. కేరళలో ఎన్నికల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి రూ.1,000 కోట్ల కప్పం కడుతున్నారని, తన కుర్చీ కాపాడుకునేందుకే ఈ వసూళ్ల పర్వం నడుస్తోందని ఆరోపించారు.

మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీస్​లో హోలీ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ పునరుజ్జీవం, గాంధీ సరోవర్ పేరుతో పేదల పట్టా భూములను అగ్గువకు లాక్కొని, కాంట్రాక్టర్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందన్నారు. ఖమ్మం, నల్లగొండ బ్యాచ్ లు సీఎం సీటుకు ఎసరు పెడుతున్నాయని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి నిరుద్యోగులకు ముఖం చూపించలేక పారిపోయారని విమర్శించారు.

2047 వరకు దేశంలో ప్రధాని సీటు ఖాళీ లేదని, మోదీనే నాయకుడిగా ఉంటారని తెలిపారు. 2028లో రాష్ట్ర ప్రజలు బీజేపీకి పట్టం కట్టడం ఖాయమన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ను మూడు ముక్కలు చేసి, కోర్ సిటీని ఎంఐఎం పార్టీకి అప్పగించేందుకు కాంగ్రెస్ స్కెచ్ వేసిందని ఆరోపించారు.