రాహుల్ ప్రధాని కావడం పక్కా..సామాన్యులెవరూ మోదీని కోరుకోవట్లేదు: మహేశ్ గౌడ్

రాహుల్ ప్రధాని కావడం పక్కా..సామాన్యులెవరూ మోదీని కోరుకోవట్లేదు: మహేశ్ గౌడ్
  • మంత్రులు నెలలో ఒకసారి డీసీసీ ఆఫీసులో కూర్చోవాలి
  • రాజ్యసభ సీటు  రేసులో 16 మంది

హైదరాబాద్, వెలుగు:  ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధాని మోదీ, బీజేపీ అనవసరంగా ఆడిపోసుకుంటున్నదని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఏదేమైనా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానిగా రాహుల్ గాంధీ ఎన్నికవడం పక్కా అని, దీన్ని ఎవరూ ఆపలేరన్నారు. మంగళవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సామాన్యులెవరూ ప్రధానిగా మోదీని కోరుకోవట్లేదని అభిప్రాయపడ్డారు. ఎప్‌స్టీన్ ఫైల్స్ లో మోదీ అడ్డంగా దొరికారని, దీనిపై బీజేపీ, ఆరెస్సెస్ సమాధానం చెప్పాలని మహేశ్​గౌడ్ డిమాండ్ చేశారు. మంత్రులు నెలకోసారైనా ఆయా జిల్లాల్లోని డీసీసీ ఆఫీసుల్లో కూర్చొని పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. తెలంగాణలోని ప్రతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు నిర్మిస్తామని, ఇందుకోసం నిబంధనల మేరకు ఒక ఎకరం భూమి తీసుకుంటామని చెప్పారు.

ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులకు సహకరించాలి 

కొందరు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులకు సహకరించడం లేదనే ఫిర్యాదులు రాహుల్ గాంధీ దృష్టికి వచ్చాయని, వీటిపై పరిశీలన చేయాలని ఆయన తనను ఆదేశించినట్టు మహేశ్ గౌడ్ చెప్పారు. అలాంటి ఎమ్మెల్యేలతో తాను మాట్లాడానని, సమస్యను పరిష్కరించానని తెలిపారు. అన్నిచోట్లా ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులకు సహకరించాలని సూచించారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ రేసులో 16 మంది ఉన్నారని, పీసీసీ తరఫున తాము సామాజికవర్గాల వారీగా హైకమాండ్ కు వారి పేర్లు ఇచ్చామన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి రాజ్యసభ సీటును అడగడం లేదని స్పష్టం చేశారు. రాజ్యసభ కోసం సమర్థులైన బీసీలు నలుగురు రేసులో ఉన్నారని, రాష్ట్రం నుంచి రెండు సీట్ల ఖాళీ ఉండగా, తెలంగాణ నేతలకు ఒకటి ఇస్తారా.. రెండు ఇస్తారా.. అనేది ఇంకా స్పష్టత లేదన్నారు. కార్పొరేట్ శక్తులకు బీఆర్ఎస్ అవకాశం ఇచ్చిందని, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి ఒక్కరికి కూడా రాజ్యసభకు అవకాశం ఇవ్వలేదని విమర్శించారు.

ఈనెలలో కార్పొరేషన్​ చైర్మన్ పదవుల భర్తీ 

ఈనెలలో కొన్ని కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీ చేస్తామని మహేశ్ చెప్పారు. పది రోజుల శిక్షణ పూర్తి చేయని ముగ్గురు డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు నిరాకరించారని తెలిపారు. వీరిలో ముగ్గురు ఎమ్మెల్యేలేనని, వారు.. బీర్ల ఐలయ్య, చిక్కుడు వంశీ కృష్ణ, రాజ్ ఠాకూర్ ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన మావోయిస్టులు కాంగ్రెస్ లో చేరతామంటే ఆహ్వానిస్తామని, కానీ ఇప్పటి వరకు తమను ఎవరూ సంప్రదించలేదని, తాము ఎవరినీ కోరలేదని స్పష్టం చేశారు.