హైదరాబాద్, వెలుగు: ఖమ్మం వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతపై అవాస్తవాలు మాట్లాడితే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ హెచ్చరించారు. ఈ ఘటనపై కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన విమర్శలను ఎంపీ తప్పుబట్టడాన్ని ఖండిస్తూ మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. గత పదేండ్లుగా భూదాన్ భూముల్లో నివసిస్తున్న 700 కుటుంబాలను వేలాది మంది పోలీసులు, బుల్డోజర్లతో తరలించడం వాస్తవం కాదా అని నిలదీశారు.
ఇండ్లు కోల్పోయిన బాధితులు రోడ్డున పడ్డారని, పునరావాస కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న విధ్వంసాన్ని కవర్ చేస్తున్న రిపోర్టర్లను అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఇవేవీ ఎంపీకి కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కేరళ సీఎం అన్నట్టుగా తెలంగాణలో ప్రస్తుతం ‘బుల్డోజర్ రాజ్యం’ నడుస్తున్నదని, కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు కట్టిస్తుంటే, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం.. ఉన్న ఇండ్లను కూల్చుతున్నదని విమర్శించారు. వెలుగుమట్ల బాధితులకు వారు నివసించిన చోటే పక్కా ఇండ్లు నిర్మించి, స్థిర నివాసం కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదని స్పష్టం చేశారు.
