జెరూసలెం: ఇరాన్ తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ ను మళ్లీ ప్రారంభించిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆ దేశ అణుబాంబు తయారీ కలను తుంచేందుకే తాము దాడులు చేశామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు. అండర్ గ్రౌండ్ బంకర్లతో అత్యంత పగడ్బందీగా న్యూక్లియర్, బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమాలను ఇరాన్ చేపట్టిందన్నారు. అణు బాంబులను తయారు చేయకుండా ఇరాన్ ను అడ్డుకోవడం భవిష్యత్తులో కష్టమవుతుందనే కారణంతో ఇప్పుడే అటాక్స్ చేస్తున్నామని వివరించారు. మంగళవారం ఆయన ఫాక్స్ న్యూస్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు.
ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.." గతేడాది జూన్‌లో 12-రోజులు ఇరాన్ పై దాడులు చేశాం. వారి న్యూక్లియార్ తయారీ సైట్లను, బాలిస్టిక్ మిస్సైల్ కార్యక్రమాలను పూర్తిగా ధ్వంసం చేశాం. కానీ, ఇరాన్ బుద్ధి మారలేదు. అండర్ గ్రౌండ్ బంకర్లను నిర్మించుకుని న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ మళ్లీ స్టార్ట్ చేసింది. ఈ బంకర్లు మరికొన్ని నెలల్లోనే న్యూక్లియర్ ప్రోగ్రామ్స్ ను మరింత పటిష్టం చేసేవి. ఇప్పుడు ఇరాన్ పై చర్యలు తీసుకోకపోతే వారిని భవిష్యత్తులో ఏమీ చేయలేం.
అందుకే దాడులు చేశాం. ఇది సుదీర్ఘ కాలం కొనసాగే యుద్ధం కాదు. ఇరాన్ పాలన ప్రస్తుతం అత్యంత బలహీనంగా ఉంది. ఇరాన్‌పై మా ఆపరేషన్ చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ముగుస్తుంది. మిడిల్ ఈస్టులో 95 శాతం సమస్యలకు ఇరానే కారణం. ఇరాన్ రెజీమ్ పతనమైతే ఇజ్రాయెల్‌తో అరబ్, ముస్లిం దేశాల మధ్య శాంతి ఒప్పందాలు పెరుగుతాయి.
అమెరికాను ఇజ్రాయెల్ యుద్ధంలోకి లాగిందనే వాదన హాస్యాస్పదం. డొనాల్డ్ ట్రంప్ ప్రపంచంలోనే అత్యంత బలమైన నాయకుడు. అమెరికా ప్రయోజనాల కోసం, భావి తరాల కోసం ఏది సరైనదో ఆయన అదే చేస్తారు" అని పేర్కొన్నారు.
