- గిరిజన గ్రామాల నుంచి పట్టణాల వరకు 100 శాతం కవర్ కావాలి
- మే 11 నుంచి ఇండ్ల జాబితా నమోదు
- ఆన్‌లైన్‌లో ‘సెల్ఫ్-ఎన్యుమరేషన్’ సదుపాయం
- కలెక్టర్లకు దిశానిర్దేశం చేసిన రామకృష్ణారావు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది పూర్తి డిజిటల్ విధానంలో చేపట్టనున్న జనగణన ప్రక్రియకు రాష్ట్ర యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. మే 11 నుంచి ప్రారంభమయ్యే తొలిదశ ప్రక్రియలో భాగంగా ఇండ్ల జాబితా (హెచ్ఎల్ఓ) నమోదు చేయనుండగా.. అంతకంటే ముందుగానే పౌరులకు ఆన్‌లైన్‌లో తమ వివరాలు స్వయంగా నమోదు చేసుకునే అవకాశం రానుంది. రాష్ట్రంలోని గిరిజన గూడెం, మారుమూల పల్లె నుంచి పట్టణాల వరకు ఏ ఒక్కరు మిగిలిపోకుండా జనగణనలో నూరు శాతం కవరేజీ సాధించాలని సీఎస్ కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంపై జనగణన శాఖ తెలంగాణ డైరెక్టర్ భారతి హోళికేరితో కలిసి మంగళవారం సెక్రటేరియెట్‌లో సీఎస్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. క్షేత్రస్థాయి ఎన్యుమరేటర్లకు, సూపర్ వైజర్లకు సిబ్బంది సామర్థ్య పెంపు కోసం మోడ్రన్ టెక్నాలజీపై హైలెవెల్ ట్రైనింగ్ఇవ్వనున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్ ద్వారా సేకరించే ఈ రియల్ టైమ్ డేటా అనేక రకాలుగా ప్రభుత్వాలకు ఉపయోగపడుతుందని సీఎస్ స్పష్టం చేశారు.
ఈ డిజిటల్ సెన్సస్ విజయవంతం కావాలంటే క్షేత్రస్థాయి సిబ్బంది టెక్నికల్ స్కిల్ కూడా కీలకమని సీఎస్ పేర్కొన్నారు. సేకరించిన సమాచారం యాప్‌లో డేటా ఎంట్రీ చేసే సమయంలో సరిగ్గా ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. అదే సమయంలో నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేయాలన్నారు. ఎలాంటి లోపాలకు తావులేకుండా పనుల్లో పారదర్శకత ఉండాలన్నారు. ఏదైనా గ్రామానికి, గిరిజన ప్రాంతాలు, మారుమూల పల్లెలకు వెళ్లేందుకు కష్టంగా ఉండే ప్రాంతాలపై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించి ఏర్పాట్లు చేసుకోవాలన్నారు.
క్షేత్రస్థాయిలో ఎదురయ్యే లాజిస్టికల్ లేదా నిర్వహణాపరమైన అడ్డంకులను ముందుగానే చూసుకోవాలని, యాక్టివ్‌గా పనిచేసేలా అధికారులకు బాధ్యతలను అప్పగించాలన్నారు. ముందుగానే మానిటరింగ్ చేస్తే డేటా సేకరణలో వేగం, కచ్చితత్వం సాధ్యమవుతుందని కలెక్టర్లకు స్పష్టం చేశారు.మొబైల్ యాప్‌ల ద్వారా సేకరించిన సమాచారం వెంటనే ప్రభుత్వ సర్వర్లకు చేరేలా యంత్రాంగాన్ని వినియోగించుకోనున్నారు. సెన్సస్ డైరెక్టర్ భారతి హోళికేరి చేసిన ప్రజెంటేషన్ కార్యనిర్వహణ యంత్రాంగానికి స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇచ్చింది.
రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి అధికారుల వరకు పద్ధతి ప్రకారం సామర్థ్యాల పెంపునకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ‘స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ కాస్కేడ్ మోడల్’ను వివరించారు. ఎన్యుమరేషన్ బ్లాకుల సరిహద్దులను పక్కాగా నిర్ధారించుకోవడం ద్వారా ఒకరి పరిధిలోకి మరొకరు రాకుండా, గందరగోళం లేకుండా అడ్డుకట్ట వేసినట్లు తెలిపారు.
సమాచారం నమోదుకు వినియోగించే డివైజ్‌లన్నీ కరెక్ట్‌గా ఉండేలా స్థానిక అధికారులతో ముందుగానే సమన్వయం చేసుకోవాలని ఆమె సూచించారు. క్షేత్రస్థాయి కార్యకలాపాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికలు, స్థానిక పరిస్థితులపై సమగ్ర అవగాహన చేసుకోవాలన్నారు. బ్లాకుల నిర్ధారణ, బార్డర్ చెక్ చేసుకోవడం, డాటా నమోదు చేసే డివైజ్ పనితీరు ముందే సరి చూసుకోవడం వంటి ఏర్పాట్లపై డైరెక్టర్ వివరించారు.
