న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విజయం సాధించింది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ కాస్త టెన్షన్ కు తెచ్చుకున్నా చివరికి అద్భుతమైన విక్టరీ కొట్టారు. ఆదివారం (జనవరి 11) వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో 4 వికెట్ల తేడాతో గెలిచి సిరీస్ లో 1-0 ఆధిక్యంలో నిలిచారు. ఈ మ్యాచ్ లో ఆసక్తికర విషయం ఏమిటంటే హర్షిత్ రానా బ్యాటింగ్ లో ఆడిన క్యామియో. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 23 బంతుల్లోనే 29 పరుగులు చేశాడు. వీటిలో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. తీవ్ర ఒత్తిడిలో హర్షిత్ ఆడిన ఇన్నింగ్స్ టీమిండియా విజయానికి కారణమైంది.
బ్యాటింగ్ ఆర్డర్ ప్రకారం హర్షిత్ రానా ఎనిమిదవ స్థానంలో బ్యాటింగ్ చేయాలి. రానా కంటే బాగా బ్యాటింగ్ చేయగల సుందర్ ఏడో స్థానంలో ఆడాల్సి ఉంది. అయితే తొలి వన్దేలో రానా 7 వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి ఆశ్చర్యపరిచాడు. గంభీర్ మరో ప్రయోగం చేశాడని భావించారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఇది అసలు ప్రయోగమే కాదు. సుందర్ కు గాయం కావడం కారణంగా హర్షిత్ ఏడో స్థానంలో ఆడాల్సి వచ్చింది. ఊహించకుండా వచ్చిన ఈ అవకాశాన్ని రానా సద్వినియోగం చేసుకున్నాడు. రాహుల్ తో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రానా 23 బంతుల్లోనే 29 పరుగులు చేయడంతో ఇండియా విజయం సులువైంది. ఈ మ్యాచ్ లో రానా బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా రాణించాడు. 10 ఓవర్లలో 65 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఇండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసి గెలిచింది. మిచెల్ 84 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొదట బౌలర్లు అంచనాలకు తగ్గట్టు రాణించకపోయినా బ్యాటర్లు దుమ్ములేపి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఛేజింగ్ లో విరాట్ కోహ్లీ (93) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడడంతో పాటు కెప్టెన్ గిల్ (56) హాఫ్ సెంచరీ చేసి రాణించాడు. 49 పరుగులు చేసి శ్రేయాస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
