గోదావరిఖనిలో అప్పుల బాధతో సింగరేణి కార్మికుడు..ఆత్మహత్య

గోదావరిఖనిలో అప్పుల బాధతో సింగరేణి కార్మికుడు..ఆత్మహత్య

గోదావరిఖని, వెలుగు: అప్పుల బాధతో ఓ సింగరేణి కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోదావరిఖని జీఎం కాలనీకి చెందిన మింగనబోయిన భార్గవ్(28) సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ఆర్జీ-2 పరిధిలోని వకీల్‌‌పల్లి మైన్‌‌లో 2016 నుంచి జనరల్ అసిస్టెంట్‌‌గా పనిచేస్తున్నాడు.

భూగర్భ గనిలోకి దిగి పనిచేయాలంటే భయంగా ఉందని చెప్పి రెండేళ్లుగా విధులకు హాజరు కావడం లేదు. పలుమార్లు మేనేజ్‌‌మెంట్ కౌన్సెలింగ్ ఇచ్చినా వినలేదు. కుటుంబ పోషణ కోసం చేసిన అప్పులు పెరగడంతో భార్గవ్ మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఉదయం ఇంటి వెనుక షెడ్డులో చీరతో ఉరేసుకున్నాడు. 

ఇంట్లో మగాళ్లంతా మృతి..

భార్గవ్ కుటుంబంలో ఇద్దరు ఆత్మహత్యలు, ఒకరు గని ప్రమాదంలో మృతిచెందడంతో ఈ ఇంట్లో మగ దిక్కు లేకుండా పోయింది. భార్గవ్​ నాన్న గణేశ్​కు డిపెండెంట్ కింద సింగరేణిలో ఉద్యోగం వచ్చింది. జాబ్​ వచ్చిన కొద్ది రోజులకే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తరువాత పెద్ద కొడుకు అనిల్ కుమార్‌‌కు ఉద్యోగం ఇవ్వగా, 2016లో జీడీకే-7 ఎల్‌‌ఈపీ గనిలో జరిగిన ప్రమాదంలో మృతిచెందాడు. అనంతరం చిన్న కొడుకు భార్గవ్‌‌కు ఉద్యోగం ఇచ్చారు. విధులకు దూరంగా ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పెరగడంతో ఈయన కూడా సూసైడ్​ చేసుకున్నాడు. ప్రస్తుతం భార్గవ్ తల్లి స్వరూప, ఆమె కూతురు, అత్త మాత్రమే ఉన్నారు.

తండ్రి లేడన్న బెంగతో యువకుడు..

హుస్నాబాద్, వెలుగు: తండ్రి మృతితో బెంగ పెట్టుకున్న ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. హుస్నాబాద్ ఎస్సై లక్ష్మారెడ్డి తెలిపిన ప్రకారం, హుస్నాబాద్ పట్టణంలోని శాంతినగర్‌‌కు చెందిన సుద్దాల శ్రీహరి ఆరు నెలల క్రితం మృతి చెందాడు. అతనికి భార్య జమున, కుమారుడు చందు(22) ఉన్నారు. కులవృత్తి చేసుకుంటూ జీవనం సాగిస్తున్న చందు, తండ్రి మరణం తర్వాత తన భవిష్యత్తుపై ఆందోళనగా ఉన్నాడు. మద్యానికి బానిసయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సయంలో మద్యం మత్తులో ఇంటికి వచ్చిన చందు, తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌‌కు ఉరేసుకున్నాడు.