Alluri Seetaram Raju: 50 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు..తెర వెనుక విశేషాలు ఇవే..

Alluri Seetaram Raju: 50 ఏళ్ళ అల్లూరి సీతారామరాజు..తెర వెనుక విశేషాలు ఇవే..

సూపర్ స్టార్ కృష్ణ(Super Star Krishna) వందో సినిమాగా వచ్చి సంచలనం సృష్టించిన చిత్రం అల్లూరి సీతారామరాజు(Alluri Seetharama Raju).ఈ సినిమా వచ్చి నేటికి  50 ఏళ్ళు పూర్తి అయింది. ఇందులో కృష్ణ సరసన విజయనిర్మల నటించగా జగ్గయ్య  కీలక పాత్రలో కనిపించారు.ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు ఈ చిత్రాన్నినిర్మించగా..వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి కొంతభాగానికి దర్శకత్వం వహించారు. 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టి్ంగ్ విషయాలు తెలుసుకుందాం.  

అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా చేయాలని ఏన్టీఆర్ అనుకున్నారు.స్క్రిప్ట్ కూడా రాయించుకుని ప్రయత్నాలు చేసినప్పటికీ అది ఫలించలేదు.ఆ తరువాత అక్కినేని, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని ప్రయత్నించారు కానీ అవి విఫలంగానే ముగిశాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ కృష్ణ  స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని తెరకెక్కించారు.  

అయితే కొంత సినిమా తీశాకా రామచంద్రరావు అనారోగ్యంతో మరణించడంతో సినిమా చిత్రీకరణ ఆగింది. దీంతో కొంతమంది సలహాలతో  కృష్ణనే మిగిలిన భాగానికి దర్శకత్వం వహించారు. అయితే సినిమాలోని పోరాట సన్నివేశాలను మాత్రం కె.ఎస్.ఆర్.దాస్ను దర్శకత్వంలో తెరకెక్కించి పూర్తి చేశారు.

ఈ సినిమాకు ఆదినారాయణరావు సంగీతాన్ని అందించగా..శ్రీశ్రీ, ఆరుద్ర,సినారె పాటలు రాశారు.ఈ సినిమాలో మహాకవి శ్రీశ్రీ రాసిన ‘తెలుగు వీర లేవరా’ పాటకు జాతీయస్థాయిలో ఉత్తమ గీత రచన పురస్కారం లభించింది. తెలుగు సినిమాకు ఈ అవార్డు రావడం అదే ప్రథమం

ఈ సినిమాను కలర్ సినిమాస్కోప్ లో చిత్రీకరించారు.కృష్ణ 100వ సినిమాగా విడుదలైన ఈ చిత్రం  19 కేంద్రాల్లో వందరోజులు ఆడింది. ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం, ఆఫ్రో-ఏషియన్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శన-బహుమతి వంటివి పొందింది. సినిమాలో తెలుగు వీర లేవరా పాట రాసినందుకు శ్రీశ్రీకి ఉత్తమ సినీ గీత రచయితగా జాతీయ పురస్కారం లభించింది.

ఈ సినిమాను ఇంక్విలాబ్ జిందాబాద్ పేరుతో హిందీలో అనువదించారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ప్రేక్షకుల మదిలో అల్లూరి సీతారామరాజు చిరస్థాయిగా నిలిచిపోతుంది.