- తెలంగాణ– చత్తీస్‌గఢ్ బార్డర్‌లోని కర్రె గుట్టల్లో భారీ ఆపరేషన్
- ఫిబ్రవరి 15లోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టుల ప్రకటన
- గడువు ముగిసినా స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు
- కేంద్రం విధించిన డెడ్‌లైన్‌కు
- 40 రోజులే ఉండడంతో ముమ్మర వేట
హైదరాబాద్, వెలుగు: మావోయిస్ట్పార్టీ చీఫ్దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఇతర ముఖ్యనేతలే లక్ష్యంగా కేంద్ర బలగాలు మరోసారి కర్రెగుట్టల్లో కూంబింగ్ ప్రారంభించాయి. ఎన్ కౌంటర్లు ఆపితే ఫిబ్రవరి 15లోపు ఆయుధాలతో లొంగిపోతామని గతంలో ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
ఆపరేషన్ కగార్2 పేరుతో మొత్తం 5 వేల మంది జవాన్లు కర్రెగుట్టలను చుట్టుముట్టి అణువణువూ జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలో మొదటి రోజే భారీ ఎన్కౌంటర్జరిగిందని, ఐదుగురు మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారనే వార్తలు వచ్చాయి. కానీ దీనిని బస్తర్ ఐజీ కన్ఫామ్ చేయలేదు.
మిగిలింది 40 రోజులే!
కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31లోగా మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్కగార్ చేపట్టింది. అప్పటి నుంచి ఆ పార్టీ కకావికలమైంది. దండకారణ్యంలో ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తూ వచ్చిన పార్టీ అగ్రనేతలు నంబాల కేశవరావు, మడవి హిడ్మా వంటి మోస్ట్ వాంటెడ్ లీడర్లను భద్రతా బలగాలు ఎన్ కౌంటర్ చేశాయి. ఆపరేషన్ కగార్‌లో భాగంగా ఇప్పటివరకు 450కిపైగా మావోయిస్టులు చనిపోగా.. నలుగురు సెంట్రల్ కమిటీ, ఐదుగురు స్టేట్ కమిటీ మెంబర్లతో పాటు 820 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
సరెండరైన వారిలో మల్లోజుల వేణుగోపాల్, ఆశన్న లాంటి అగ్రనేతలున్నారు. ఈ క్రమంలోనే తమకు 2026 ఫిబ్రవరి 15 వరకు గడువిస్తే ఆయుధాలతో సహా లొంగిపోతామంటూ గతేడాది నవంబర్ 24 న పలువురు మావోయిస్టు లీడర్లు బహిరంగ లేఖలు విడుదల చేశారు. టీవీలు, రేడియాల్లో ప్రసారం చేయాలని కేంద్రంతో పాటు నాలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరారు. పోలీసుల కూంబింగ్‌లు నిలిపివేయాలని, ఎన్కౌంటర్లు ఆపాలని విజ్ఞప్తి చేశారు.
దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి వినతుల మేరకు గడువిచ్చాయి. ఎక్కడికక్కడ కూంబింగ్‌లు ఆపేశాయి. గడువు ముగిసినా మావోయిస్ట్ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, బెటాలియిన్ ఇన్‌చార్జి కేసా సోది, బడే చొక్కారావు వంటి లీడర్లు దండకారణ్యం నుంచి బయటికి రాలేదు. మరోవైపు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పెట్టిన గడువుకు ఇంకా కేవలం 40 రోజులే మిగిలి ఉండటంతో మరోసారి కేంద్ర బలగాలు కర్రె గుట్టలు లక్ష్యంగా ‘ఆపరేషన్ కగార్–2’ స్టార్ట్ చేశాయి. ఇంకా దేశవ్యాప్తంగా 150 నుంచి 200 మంది మావోయిస్టు ఉద్యమంలో ఉండగా.. వీరిలో కీలక నేతలను పట్టుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి.
మావోయిస్టు ఉద్యమంలో
కొనసాగుతున్న లీడర్లు వీరే..
మావోయిస్టు ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లే కీలకపాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లు, లొంగుబాట్ల తర్వాత ఇంకా రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టు లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్లు పోలీసులు తేల్చారు. వీరిలో మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీతో పాటు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మావోయిస్ట్ పార్టీ మాజీ చీఫ్, సీనియర్ లీడర్, సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ్ రావు అలియాస్ గణపతి, మావోయిస్ట్ పార్టీ చీఫ్, జనరల్ సెక్రటరీ తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్ కీలక నేతలు ఇప్పటికీ అజ్ఞాతంలోనే ఉన్నారు.
వీరితో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ పుసునూరి నరహరి అలియాస్ సంతోష్, సైనిక వ్యవహారాల ఇన్‌చార్జి బడే చొక్కారావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్‌చార్జి వార్తా శేఖర్ అలియాస్ మంగ్తు, సెంట్రల్ కమిటీ మెంబర్ జోడే రత్నబాయి అలియాస్ సుజాత, వెస్ట్ సబ్ జోనల్ బ్యూరో కార్యదర్శి లోకేటి చందర్ రావు అలియాస్ ప్రభాకర్ తదితరుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.
కూంబింగ్ జరుగుతోంది
నక్సల్స్ వ్యతిరేక కార్యకలపాలను అరికట్టడానికి బస్తర్ రేంజ్ పరిధిలో కేంద్రం, చత్తీస్‌గఢ్ రాష్ట్ర పోలీస్‌బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. ఈ ఆపరేషన్‌కు సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడిస్తాం.
- పి.సుందర్ రాజ్, బస్తర్ ఐజీ
