- టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ చర్యలు
- సస్పెండ్ అయిన వారిలో ఒక ఏడీఈ, ముగ్గురు ఇంజినీర్లు
హైదరాబాద్, వెలుగు: వినియోగదారుల నుంచి లంచాలు తీసుకుంటున్న విద్యుత్ అధికారులపై దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీ ఎస్పీడీసీఎల్) కొరడా ఝులిపించింది. డ్యూటీలో భాగంగా చేయాల్సిన పనులకు సైతం డబ్బులు వసూలు చేసిన 8 మంది ఇంజినీర్లను సస్పెండ్ చేస్తూ గురువారం టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ అలీ ఫరూఖీ ఉత్తర్వులు జారీ చేశారు.
సస్పెండ్ అయిన వారిలో ఒక ఏడీఈ, ఇద్దరు ఏఈలు, ఒక సబ్ ఇంజినీర్, ముగ్గురు లైన్మేన్లు, ఒక గ్రేడ్–3 ఉద్యోగి ఉన్నారు. విద్యుత్ శాఖలో అధికారులు, సిబ్బంది అవినీతిపై కొంతకాలంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. దక్షిణ డిస్కమ్ పరిధిలో 150కు పైగా ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇంజినీర్లు ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ ద్వారా లంచాలు తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. రెగ్యులర్ సేవలు అందించేందుకు, ఫైళ్లను త్వరగా పరిష్కరించేందుకు, కొత్త కనెక్షన్లు ఇచ్చేందుకు 8 మంది అధికారులు లంచాలు తీసుకున్నట్లు పక్కా ఆధారాలు సేకరించి, ఉన్నతాధికారులకు నివేదించారు.
ఈ నివేదిక మేరకు భువనగిరి పరిధిలో ఏడీఈగా పనిచేస్తున్న ఆర్. ఆనంద రెడ్డి, శాంతి నగర్ ఏఈ చిన్న సుబ్బరాయుడు, భాగ్యనగర్ సెక్షన్ ఏఈగా పనిచేస్తున్న షాబాజ్ అహ్మద్, సంగారెడ్డి సర్కిల్లో సబ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న జి.మధుసూదన్, లైన్మేన్లు జిల్లపల్లి శ్రీనివాస్, షేక్ శావలి, జూనియర్ లైన్‌మేన్ డప్పు అంజిలయ్య, గ్రేడ్–3 ఎంప్లాయ్ ఎండీ. ఖలీల్‌ను సస్పెండ్ చేస్తూ సీఎండీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
