- బీసీలకు బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించాలి
ముషీరాబాద్, వెలుగు : బీసీలకు అన్యాయం చేసేందుకు అన్ని పార్టీలు కుట్ర చేస్తున్నాయని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ప్రభుత్వం బీసీలను అణచివేస్తుంటే.. రాజకీయ పార్టీలు ప్రేక్షకపాత్ర వహిస్తున్నాయని మండిపడ్డారు. బీసీలు తెగించి పోరాడకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం జరుగుతుందని, 42 శాతం రిజర్వేషన్లు ఇప్పుడు కాకపోతే భవిష్యత్‌లో మరెప్పుడూ సాధించలేమన్నారు.
హైదరాబాద్ విద్యానగర్ బీసీ భవన్‌లో గురువారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు పెంచకుండా జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎలా వెళ్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
బీసీలకు రూ. 25 వేల కోట్లు కేటాయించాలి
బీసీల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధికి బడ్జెట్‌లో రూ. 25 వేల కోట్లు కేటాయించాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు 14 బీసీ సంఘాల ప్రతినిధులతో చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావును కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో రూ. 25 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించినా.. ఇంతవరకు రూ. 10 వేల కోట్లకు మించి కేటాయించడం లేదన్నారు.
బడ్జెట్ కేటాయించకపోవడంతో బీసీ సంక్షేమం, అభివృద్ధి కుంటుపడిందని, కొత్త పథకాలు అమలు చేయడం లేదని, ఫీజులు, స్కాలర్‌షిప్‌లు చెల్లించడం, బీసీ కార్పొరేషన్ రుణాలు మంజూరు కావడం లేదన్నారు. ఇప్పటికైనా బడ్జెట్ కేటాయించకపోతే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ఆయన వెంట రాజేందర్, జిల్లపల్లి అంజి, నీల వెంకటేశ్, అనంతయ్య, పగిళ్ల సతీశ్, రాందేవ్, శివకుమార్ యాదవ్ పాల్గొన్నారు.
