మంచిర్యాలలో బీఆర్ఎస్‌ బంద్‌కు స్పందన కరువు... పట్టించుకోని పబ్లిక్

మంచిర్యాలలో బీఆర్ఎస్‌ బంద్‌కు స్పందన కరువు... పట్టించుకోని పబ్లిక్
  • యథావిధిగా కార్యకలాపాలు
  • ఉదయం నుంచే తెరుచుకున్న వ్యాపార, వాణిజ్య సముదాయాలు 

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ బంద్ విఫలమైంది. చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్టుకు నిరసనగా గురువారం జిల్లా బంద్‌కు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దానికి ప్రజల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఆ పార్టీ నాయకులు కంగుతిన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల సంఘం నాయకులకు బీఆర్ఎస్ లీడర్లు ఫోన్లు చేసి బెదిరించి స్కూళ్లను బంద్ పెట్టించే ప్రయత్నం చేశారు. 

ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసులు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఎప్పట్లాగే నడిచాయి. ఉదయం నుంచే షాపులు, హోటళ్లు, పెట్రోల్‌ బంకులు, షాపింగ్‌ మాల్స్‌, షోరూమ్స్‌ తెరుచుకున్నాయి. మార్కెట్ కార్యకలాపాలు ఎప్పటిలాగే కొనసాగాయి. జిల్లాలో బీఆర్ఎస్ బంద్ ప్రభావం ఎక్కడా కనిపించలేదు. బీఆర్ఎస్ నాయకులు బైకులపై తిరుగుతూ హడావుడి చేసినా పబ్లిక్ పట్టించుకోకపోవడం గమనార్హం.

పోలీసులను వదిలిపెట్టం: సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌రావు

ఆదిలాబాద్, వెలుగు : మాజీమంత్రి హరీశ్‌‌రావు పోలీసులపై మరోసారి నోరుపారేసుకున్నారు. వచ్చేది బీఆర్ఎస్‌‌ ప్రభుత్వమేనని, అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులు తీరు మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శుక్రవారం ఆదిలాబాద్ జైలులో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌‌తో ములాఖత్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 

పోలీసులు కాంగ్రెస్ నాయకుల చుట్టాల్లా వ్యవహరిస్తున్నారని, బాల్క సుమన్‌‌ను స్థానిక జైల్లో కాకుండా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదిలాబాద్‌‌కు తరలించడం అన్యాయమన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు అనిల్‌‌ జాదవ్‌‌, కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ శంభీపూర్‌‌ రాజు, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న తదితరులు ఉన్నారు.