సాగుకు ముందే మట్టి పరీక్షలు చేయించాలి: రైతు సంక్షేమ కమిషన్‌‌ చైర్మన్‌‌ కోదండరామిరెడ్డి

సాగుకు ముందే మట్టి పరీక్షలు చేయించాలి: రైతు సంక్షేమ కమిషన్‌‌ చైర్మన్‌‌ కోదండరామిరెడ్డి

వంగూరు, వెలుగు : వ్యవసాయంలో సేంద్రియ ఎరువులను వాడడం వల్ల అధిక దిగుబడులు సాధించడంతో పాటు రైతులకు మంచి లాభాలు వస్తాయని రాష్ట్ర రైతు కమిషన్‌‌ చైర్మన్‌‌ కోదండరామిరెడ్డి చెప్పారు. ఈ విషయంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నాగర్‌‌కర్నూల్‌‌ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోదండరామిరెడ్డితో పాటు కలెక్టర్‌‌ బాదావత్‌‌ సంతోష్‌‌, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్షల ప్రాముఖ్యత, ఎరువుల వినియోగ విధానాన్ని వివరించారు. 

ఈ సందర్భంగా కోదండరామిరెడ్డి మాట్లాడుతూ... రైతులు  పంట సాగుకు ముందే మట్టి పరీక్షలు చేయించాలని, ఈ సమాచారం ఆధారంగా ఎరువుల వినియోగం, నీటి నిర్వహణ, పంటల ఎంపిక ఈజీ అవుతుందన్నారు. అవసరానికి మించి ఎరువులు వాడడం వల్ల రైతులకు ఆర్థికంగా నష్టం కలగడంతో పాటు భూసారం కూడా తగ్గిపోతోందన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచేందుకు శాస్త్రీయ పద్ధతులు అనుసరించాలని సూచించారు. 

రైతులు నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ, ఖర్చులను తగ్గించి, స్థిరమైన వ్యవసాయ విధానాలను అనుసరించాలని సూచించారు. అనంతరం మినీ కిట్లు, భూసార పరీక్షలకు సంబంధించిన పరికరాలను పంపిణీ అందజేశారు. కార్యక్రమంలో రైతు సంక్షేమ కమిషన్‌‌ సభ్యులు కేవీయన్ రెడ్డి, చెవిటి వెంకన్న యాదవ్, మరికంటి భవానీరెడ్డి, భూమి సునీల్, రాంగోపాల్‌‌రెడ్డి, రాములునాయక్, గంగాధర్‌‌, రైతు సంక్షేమ కమిషన్‌‌ మెంబర్‌‌ సెక్రటరీ గోపాల్, అడిషనల్‌‌ డైరెక్టర్లు సుచిత్ర, సంధ్యారాణి, సైంటిస్ట్‌‌ బజేంద్ర, డాక్టర్ రాంప్రకాశ్‌‌, జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్ రావు, సర్పంచ్‌‌ మల్లెపాకుల వెంకటయ్య పాల్గొన్నారు.