డిగ్రీ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి కొత్త రూల్స్.. టీజీపీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్.. ఉత్తర్వులు జారీ

డిగ్రీ లెక్చరర్స్ పోస్టుల భర్తీకి కొత్త రూల్స్.. టీజీపీఎస్సీ ద్వారానే రిక్రూట్మెంట్.. ఉత్తర్వులు జారీ
  • అకడమిక్ స్కోరుకు 50, పరీక్షకు 40, ఇంటర్వ్యూకు 10 మార్కులు
  • అసిస్టెంట్ ప్రొఫెసర్, లైబ్రేరియన్, పీడీ నియామకాలకు గైడ్‌‌‌‌లైన్స్ 


డీఎల్, లైబ్రేరియన్, పీడీ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసింది. అభ్యర్థి అకడమిక్ స్కోర్​కు 50 శాతం వెయిటేజీ, రాత పరీక్షకు 40 శాతం,  ఇంటర్వ్యూకు 10 శాతం మార్కులు కేటాయించారు.

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని సర్కారు డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్ (డీఎల్​) , లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను ఖరారు చేసింది. గతంలో ఉన్న గందరగోళాన్ని తొలగిస్తూ, కోర్టు కేసులకు తావులేకుండా ఉండేలా ఎంపిక ప్రక్రియపై గైడ్​ లైన్స్​ ను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా ఉత్తర్వులు జారీ చేశారు. టీజీపీఎస్సీ ద్వారానే ఈ నియామకాలు చేపట్టనున్నారు. 

ఎంపిక ప్రక్రియ ఇలా.. 

కొత్త జీవో ప్రకారం.. ఎంపిక ప్రక్రియను మొత్తం మూడు భాగాలుగా విభజించారు. అభ్యర్థుల ప్రతిభను 100 మార్కులకు లెక్కగట్టి ఫైనల్ సెలక్షన్ చేస్తారు. అయితే, గతంలో కేవలం రాత పరీక్షకే వంద శాతం మార్కులు ఉండేవి. కానీ, ఈసారి దీన్ని మార్చారు. అకడమిక్ స్కోర్ కు అభ్యర్థి గత విద్యారికార్డుల ఆధారంగా గరిష్టంగా 50 శాతం వెయిటేజీ ఇస్తారు. సబ్జెక్టు నైపుణ్యాన్ని పరీక్షించేందుకు నిర్వహించే రాత పరీక్షకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది. 

వ్యక్తిగత ఇంటర్వ్యూకు 10 శాతం మార్కులు కేటాయించారు.  టీజీపీఎస్సీ నిర్వహించే ఈ రాత పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. దీనికి రెండున్నర టైమ్ ఇస్తారు. రాత పరీక్షలో క్వాలిఫై కావాలంటే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం కనీస మార్కులు రావాల్సి ఉంటుంది. 

1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు

రాత పరీక్షలో వచ్చిన మార్కులు 40% వెయిటేజీ, అకడమిక్ స్కోర్ 50% వెయిటేజీ కలిపి మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. దీని ఆధారంగా ప్రతి కేటగిరీలో ఒక్కో పోస్టుకు ఐదుగురు అభ్యర్థులను 1:5 నిష్పత్తిలో ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. చివరగా రాత పరీక్ష, అకడమిక్ స్కోర్, ఇంటర్వ్యూ మార్కులన్నీ కలిపి రిజర్వేషన్ల ప్రకారం తుది జాబితాను ప్రకటిస్తారు. 

యూజీసీ నిబంధనల ప్రకారమే..

ఈ నియామకాలన్నీ యూజీసీ –- 2018 రెగ్యులేషన్స్, తర్వాతి సవరణల ప్రకారమే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంటర్వ్యూల నిర్వహణ కోసం టీజీపీఎస్సీ చైర్మన్ లేదా వారి ప్రతినిధి అధ్యక్షతన, కాలేజియేట్ ఎడ్యుకేషన్ కమిషనర్, ముగ్గురు సబ్జెక్టు నిపుణులతో కూడిన సెలక్షన్ కమిటీ ఉంటుంది. కోర్టు వివాదాలు రాకుండా ఉండేందుకే ఈ సమగ్ర ఉత్తర్వులు ఇచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.