తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటి త్రిష

అమరావతి: ప్రముఖ సినీ నటి త్రిష తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం (ఫిబ్రవరి 19) సాయంత్రం శ్రీవారి నైవేద్య విరామంలో శ్రీవాణి వీఐపీ బ్రేక్‌ దర్శన సమయంలో తిరుమలేశుడిని దర్శించుకుని మొక్కలు తీర్చుకున్నారు. అంతకముందు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌ మీదుగా శ్రీవారి ఆలయ మహాద్వారం దగ్గరకు చేరుకున్న త్రిషకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. 

అనంతరం స్వామి వారి దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. త్రిషను చూసేందుకు భక్తులు పోటీపడ్డారు. ఇటీవల తమిళనాడులో త్రిష, విజయ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి తిరుమల పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

త్రిష, విజయ్ ఇష్యూ ఏంటంటే..?

నటి త్రిష, విజయ్‎పై తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటీవల చెన్నై విమానాశ్రయంలో ఆయన మాట్లాడుతూ.. ఒక రాష్ట్రాన్ని నడిపించే ముందు వ్యక్తిగత, కుటుంబ విషయాలను సరిచేసుకోవాలని ఆయన సూచించారు. కుటుంబంతో సత్సంబంధాలు కొనసాగించడంతో పాటు, గొప్ప నాయకులు తమ ఉద్యమాలను ఎలా నిర్మించారో తెలుసుకోవాలని హితవు పలికారు.

‘‘విజయ్‌కు రాజకీయాల గురించి ఏమీ తెలియదు. అతనికి అనుభవం లేదు. ముందుగా అతను తన ఇంటి నుంచి బయటకు వచ్చి చూడమనండి. దానికంటే ముందు అతను త్రిషకు దూరమై బయటకు వస్తేనే వాస్తవాలను గ్రహించగలడు’’ అని వ్యక్తిగత వ్యాఖ్యలు చేశాడు. విజయ్, త్రిషపై నాగేంద్రన్ చేసిన కామెంట్స్ తమిళ్ పాలిటిక్స్ లో పెను దుమారం రేపాయి. 

నాగేంద్రన్ వ్యాఖ్యలపై అధికార డీఎంకే, టీవీకే, విజయ్ అభిమానులు భగ్గుమన్నారు. రాజకీయాల్లోకి వ్యక్తిగత విషయాలను లాగడం ఏంటని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై నటి త్రిష కూడా మండిపడింది. నాగేంద్రన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నటి.. ఆయన కామెంట్స్ చాలా అసహ్యంగా ఉన్నాయని సీరియస్ అయ్యింది. 

తనకు రాజకీయాలతో ఎటువంటి సంబంధం లేదని.. తనను అనవసర రాజకీయ వివాదాల్లోకి లాగితే న్యాయపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. మరో రెండు నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఉన్న వేళ త్రిషపై చేసిన వ్యాఖ్యలు బూమారాంగ్ అవ్వడంతో నాగేంద్రన్ చివరకు ఆమెకు క్షమాపణలు చెప్పాడు.