- హోటళ్ల బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ మాయాజాలం బట్టబయలు
- హైదరాబాద్లో తీగలాగితే దేశవ్యాప్తంగా కదిలిన డొంక
- ఏఐతో 1.77 లక్షల రెస్టారెంట్ల 60 టెరాబైట్ల బిల్లుల విశ్లేషణ
- భారీగా అక్రమాలను గుర్తించిన అధికారులు
- తెలంగాణ, ఏపీలో రూ.5,100 కోట్ల విలువైన బిల్లులు మాయం
- బిల్లుల మోసంలో మొదటి స్థానంలో కర్నాటక
- రెండో స్థానంలో తెలంగాణ, ఆ తర్వాత తమిళనాడు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని హోటళ్లలో జరిగిన చిన్నపాటి తనిఖీలు దేశవ్యాప్తంగా 70 వేల కోట్ల రూపాయల భారీ పన్ను ఎగవేతను బయటపెట్టాయి. బిర్యానీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే హైదరాబాద్‌లో మొదలైన ఈ సోదాలు చివరకు దేశంలోని రెస్టారెంట్ రంగాన్నే కుదిపేసే అతిపెద్ద కుంభకోణంగా మారాయి. హోటళ్లలోని కంప్యూటర్ బిల్లింగ్ వ్యవస్థలను అధికారులు నిశితంగా పరిశీలించినప్పుడు యజమానులు చూపుతున్న లెక్కలకు, అసలు జరుగుతున్న అమ్మకాలకు పొంతన లేదని తేలింది. వినియోగదారుల నుంచి పన్నుతో సహా బిల్లులు వసూలు చేసి వాటిని ప్రభుత్వానికి కట్టకుండా యజమానులు తమ జేబులో వేసుకుంటున్నట్లు బయటపడింది.
దేశవ్యాప్తంగా లక్షకు పైగా రెస్టారెంట్లు ఒకే రకమైన బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతూ ఆదాయాన్ని తక్కువ చేసి చూపుతున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ భారీ మోసం గత కొన్నేళ్లుగా నిరాటంకంగా సాగుతూ ప్రభుత్వ ఖజానాకు కన్నం వేస్తున్నట్లు తాజా రిపోర్టులు చెప్తున్నాయి. హైదరాబాద్ నుంచి మొదలైన ఈ దర్యాప్తు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న వేలాది హోటళ్లపై సాగుతున్నది. అధికారులు ఈ భారీ కేసును ఛేదించడానికి మోడ్రన్ టెక్నాలజీని వాడారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనే సుమారు రూ. 5,100 కోట్లకు పైగా అమ్మకాలను రికార్డుల నుంచి మాయం చేసినట్లు గుర్తించారు. ఈ స్కామ్ వెనుక సాఫ్ట్‌వేర్ సంస్థల హస్తం కూడా ఉన్నట్లు విచారణలో ఆధారాలు దొరికాయి.
రోజుకు 15 లక్షల బిర్యానీలు.. ఖజానాకు మాత్రం ‘సున్నా’
హైదరాబాద్ లో బిర్యానీ అమ్మకాల లెక్కలు చూస్తే ఈ ఎగవేత భారీగా ఉన్నది. హైదరాబాద్లో రోజుకు సగటున 10 నుంచి 15 లక్షల బిర్యానీలు అమ్ముడవుతాయని అంచనా ఉండగా పండుగలు, వారాంతాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. ఏటా వేల కోట్ల రూపాయల బిర్యానీ వ్యాపారం జరుగుతున్నా అందులో సగం కూడా రికార్డుల్లోకి ఎక్కడం లేదన్నది స్పష్టమవుతున్నది. ముఖ్యంగా నగదు రూపంలో జరిగే చెల్లింపుల విషయంలో పక్కాగా జీఎస్టీ ఎగవేత సాగుతున్నది. ఆన్‌లైన్ లేదా కార్డ్ చెల్లింపులను కూడా తప్పనిసరైతేనే రికార్డుల్లో చూపిస్తున్నారు.
హైదరాబాద్‌లో చిన్న బిర్యానీ సెంటర్ నుంచి పెద్ద హోటల్ వరకు కస్టమర్ల నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నా అది ప్రభుత్వానికి చేరడం లేదు. కస్టమర్లకు మొక్కుబడిగా ముడి బిల్లులు ఇవ్వడం లేదా సాఫ్ట్‌వేర్‌లో బిల్లును వెంటనే డిలీట్ చేయడం ద్వారా పన్నుల నుంచి తప్పించుకుంటున్నారు. ఈ పన్ను ఎగవేతలో కర్నాటక దేశంలోనే మొదటి స్థానంలో ఉండగా.. తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. తమిళనాడు మూడో స్థానంలో ఉంది. బిర్యానీ హాండీల వెనుక దాగున్న ఈ నల్లధనం ఇప్పుడు అధికారుల పాలిట పెద్ద సవాల్‌గా మారింది.
ఏఐ నిఘాలో దొరికిపోయిన హోటళ్లు
ఈ కుంభకోణాన్ని ఛేదించడానికి దర్యాప్తు అధికారులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా అనలిటిక్స్ వంటి అడ్వాన్స్‌డ్ టూల్స్‌ను ఉపయోగించారు. దేశవ్యాప్తంగా ఉన్న సుమారు లక్షా డెబ్భై ఏడు వేల రెస్టారెంట్లకు చెందిన 60 టెరాబైట్ల భారీ సమాచారాన్ని విశ్లేషించినప్పుడు విస్తుపోయే నిజాలు తెలిశాయి. కస్టమర్ భోజనం చేసి బిల్లు కట్టిన తర్వాత ఆ బిల్లును సిస్టమ్ నుంచి పూర్తిగా తీసేయడం లేదా మార్చేయడం ద్వారా ఈ దగాకు పాల్పడుతున్నారు.
సాధారణంగా హోటల్ సిబ్బంది డబ్బులు దొంగిలించకుండా యజమానులు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌ను వాడుతుంటారు కానీ ఇక్కడ యజమానులు సాఫ్ట్‌వేర్ కంపెనీలతో కుమ్మక్కై ప్రభుత్వాన్ని మోసం చేశారు. కేవలం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోనే రికార్డుల్లో లేని అమ్మకాలు రూ.5,100 కోట్లుగా ఉండగా దేశవ్యాప్తంగా ఇలా మాయం చేసిన బిల్లుల విలువ రూ.13 వేల కోట్లు దాటింది. అధికారులు కేవలం 40 హోటళ్లకు స్వయంగా వెళ్లి తనిఖీ చేసినప్పుడే సుమారు రూ. 400 కోట్ల మేర లెక్కల్లో లేని అమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. ఇలా దాదాపు నాలుగో వంతు ఆదాయాన్ని రెస్టారెంట్లు తెలియకుండా దాచి పెడుతున్నట్లు ఈ దర్యాప్తులో తేలింది. మొత్తం రూ.2.50 లక్షల కోట్ల విలువైన ఆరేళ్ల వ్యాపార లావాదేవీలను అధికారులు తమ డిజిటల్ ల్యాబ్‌లలో పూర్తిగా తనిఖీ చేశారు.
నగదు బిల్లుల మాయాజాలం.. సాఫ్ట్‌వేర్ సంస్థల సహకారం
క్యాష్ బిల్లులను మాత్రమే సిస్టమ్ నుంచి తీసేయడం వీరి ప్రధాన వ్యూహంగా ఉండగా, మరికొన్ని హోటళ్లు ఏకంగా కొన్ని రోజుల పాటు జరిగిన అమ్మకాలనే రికార్డుల నుంచి తుడిచేసి ఆ రోజు వ్యాపారమే కాలేదని అబద్ధం చెబుతున్నాయి. ప్రతి నెలా పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వాస్తవ ఆదాయంలో కేవలం ముప్పై శాతాన్ని మాత్రమే వెల్లడిస్తూ మిగిలిన డెబ్బై శాతాన్ని బ్లాక్ మనీగా మారుస్తున్నారు. ఈ భారీ స్కామ్ మొదట హైదరాబాద్, విశాఖపట్నం కేంద్రంగా బయటపడినా లోతుగా విచారిస్తే ఇది దేశవ్యాప్త నెట్‌వర్క్‌గా తేలిపోయింది.
బిల్లింగ్ సాఫ్ట్‌వేర్ తయారు చేసే సంస్థలే ఈ ఎగవేతకు సహకరిస్తున్నట్లు అధికారుల దర్యాప్తులో పక్కా ఆధారాలు దొరికాయి. తనిఖీలకు వెళ్లినప్పుడు కంప్యూటర్ స్క్రీన్‌పై డేటా కనిపిస్తున్నా లోపల మాత్రం ఆ సమాచారాన్ని మార్చే వెసులుబాటు యజమానులకు ఇచ్చారు. దీంతో జీఎస్టీ అధికారులకు ఆన్‌లైన్ వివరాలకు రికార్డులకు పొంతన లేకుండా పోతోంది. ప్రస్తుతం ఈ కుంభకోణం విలువ రూ.70 వేల కోట్లుగా ఉన్నా విచారణ పూర్తయ్యేసరికి ఈ సంఖ్య లక్ష కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని నిపుణులు అంటున్నారు.
