భవాంచకు భలే ధర.. క్వింటాల్‌కు రూ.10 వేలు

భవాంచకు భలే ధర.. క్వింటాల్‌కు రూ.10 వేలు
  • ఆసక్తిగా సేకరిస్తున్న గిరిజనులు
  • సోరియాసిస్​లాంటి వ్యాధుల ట్రీట్​మెంట్​కు గింజల వాడకం

జైనూర్, వెలుగు: అడవులు, చేనుల్లో పెరిగే ‘భవాంచ’ అనే పిచ్చిమొక్కకు బంగారు కాలం వచ్చింది. ఏండ్ల తరబడి కలుపు మొక్కగా భావించిన భవాంచ ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో రైతులకు అదనపు ఆదాయ వనరుగా మారుతోంది. అడవుల్లో, పత్తి చేనుల అంచుల్లో పెరిగే ఈ మొక్క గింజలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఏర్పడింది. గత ఐదేండ్లుగా వ్యాపారులు నేరుగా గ్రామాలకు వచ్చి కొనుగోలు చేస్తుండడంతో రైతులు, గ్రామస్తులు ఆసక్తిగా సేకరిస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతంలోని జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాలకు చెందిన రైతులు సేకరించి జైనూర్ మార్కెట్‌లో అమ్ముతున్నారు. 

ఔషధ గుణాలే డిమాండ్‌కు కారణం

భవాంచగా పిలిచే ఈ మొక్క శాస్త్రీయ నామం ‘బాబ్చి’. గోండి బాషలో మాడవి రోండ అని కూడా పిలుస్తారు. వీటి గింజలు నువ్వుల గింజల్లా గరుకుగా ఉండి ప్రత్యేక వాసన వస్తాయి. జనవరి నుంచి మార్చి నెల వరకు దీని సేకరించడానికి అనుకూలమైన సీజన్. బాబ్చి గింజలకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా సోరియాసిస్ (తెల్ల మచ్చలు) వంటి చర్మ వ్యాధుల్లో హర్బల్ నూనెల తయారీలో వీటిని ఉపయోగిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. గింజల్లో ఉండే నూనె పదార్థం చర్మ వ్యాధులను నయం చేస్తుందని పేర్కొంటున్నారు. షాంపూ తయారీలోనూ వాడుతున్నారని ఏజెన్సీలో ప్రచారం ఉంది.

క్వింటల్‌కు రూ.10 వేలపైనే

భవాంచను గతంలో కలుపు మొక్కగా తొలగించేవారు. ఇప్పుడు మాత్రం పండిన తర్వాత గింజలను ఎండబెట్టి వ్యాపారులకు అమ్ముతున్నారు. నాణ్యమైన బాబ్చి గింజలకు మార్కెట్‌లో క్వింటల్‌కు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతోందని గిరిజనులు చెబుతున్నారు. కొన్ని గ్రామాల్లో రైతులు ఈ మొక్కను సాగు చేసే ఆలోచనలో ఉన్నారు. తక్కువ పెట్టుబడితో పెరిగే ఈ మొక్క నల్లరేగడి భూమికి అనుకూలమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నాయి. 

సమాచారం లోపం పెద్ద సమస్య

బాబ్చి గింజలకు మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ.. గ్రామాల్లో సేకరించి అమ్మే గిరిజనులకు గిట్టుబాటు ధర అందడం లేదనే ఆరోపణలున్నాయి. మధ్యవర్తులు తక్కువ ధరకు కొని, బయట మార్కెట్​లో ఎక్కువ ధరకు అమ్ముతున్నారని రైతులు చెబుతున్నారు. భవాంచ సాగు, మార్కెట్ ధరలు, వినియోగంపై వ్యవసాయ శాఖ, సంబంధిత శాఖల అధికారులు తెలియజేయాలని, స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఏజెన్సీ వాసులు అభిప్రాయపడుతున్నారు.