యువతకు 50 శాతం సీట్లు : పొన్నం

యువతకు 50 శాతం సీట్లు : పొన్నం

కరీంనగర్ : మున్సిపల్ ఎలక్షన్స్ సంబంధించి గురువారం ప్రెస్ మీట్ లో మాట్లాడారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్.  ‘మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయాలనుకునేవారు డీసీసీ ఆఫీసులో దరఖాస్తు చేసుకోవాలి. సెలక్ట్ & ఎలక్ట్ పద్ధతిలో అభ్యర్థులను 15 మంది సభ్యుల కమిటీ సూచనలతో ఎంపిక జరుగుతుంది. యువతకు 50 శాతం సీట్లు ఇస్తాం. తటస్థంగా ఉండే సంఘాల నేతలు, అడ్వకేట్లు మున్సిపల్ ఎన్నికల్లో మా మద్ధతు కోరితే  సహకరించే అంశాన్ని పరిశీలిస్తాం. పట్టణ ప్రాంతాల్లో నివసించే ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్నారు. వీళ్ళంతా కాంగ్రెస్ కు మద్ధతు ఇవ్వాలి.  మా పార్టీ వాళ్ళను టీఆర్ఎస్ లో చేర్చుకుని బలుపు అనుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్  మాత్రమే ప్రత్యామ్నాయం అని  కోట కేటీఆర్  ఒప్పుకున్నారు. ఎంత మంది పార్టీని వీడినా, ఆఖరికి  నేను వెళ్లినా కాంగ్రెస్ జీవనది లాంటిది. కరీంనగర్ కార్పోరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తాం.

ప్రతిపక్షాలను గెలిపిస్తే అభివృద్ధి ఆగుతుందని మంత్రి చెప్పడం అవాస్తం. కరీంనగర్ లో మీరు సాధించిన అభివృద్ధిపై చర్చకు టీఆర్ఎస్ నేతలు సిద్ధమా ?. చేసిన పనుల్లో అంతులేని అవినీతి జరిగింది. నామినేషన్ పై పనులు కేటాయించి ప్రజాధనం వృథా చేసారు. మేము ఉన్నప్పుడు ఇచ్చిన నల్లాలు కాకుండా ఒక్క ఇంటికైనా కొత్త నల్లా ఇచ్చారా?. మున్సిపల్ ఎన్నికల్లో నీళ్లేవో, పాలేవో తేలాలి. లండన్, న్యూయార్కు లాగా కరీంనగర్ ను చేస్తానన్న కేసీఆర్.. ఇప్పుడు వేములవాడ దగ్గరున్న నీటిని చూపిస్తున్నాడు. ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ ముప్పుతిప్పలు పెట్టారు. మేము 10 వేల మందికి కరీంనగర్ లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చాం. మీరు ఒక్కరికైనా డబుల్ రూం హౌస్ ఇచ్చారా?.

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రశ్నించే గొంతు ఆవశ్యకతను ప్రజలకు వివరిస్తాం. కాంగ్రెస్ పార్టీ కున్న  ఇబ్బందులన్నీ  అధిగమిస్తాం. దేశానికి కాంగ్రెస్ మాత్రమే రక్ష. మత విధ్వేషాలు రెచ్చగొడుతూ టీఆర్ఎస్, బీజేపీ ఆశాంతికి కారణమవుతున్నాయి. మృత్యుంజయం కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి  వచ్చిందో ఆయన చెబితే స్పందిస్తా. కరీంనగర్ లో పార్టీకి నష్టం కలగకుండా తొందరలోనే కమిటీ వేయాలని పార్టీని కోరుతున్నా. నేను నామినేషన్ వేసినప్పుడు రానోళ్లు ఈ పార్టీలో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే.  ఎవరున్నా, లేకున్నా పార్టీకి జరిగే నష్టమేమీ లేదు. ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయి.  వార్డుల విభజనలో అభ్యంతరాలు తీసుకున్నా.. వాటిని  పరిగణలోకి తీసుకోలేదు. నేను ఎవరికీ టికెట్లు ఇవ్వమని సిఫారసు చేయను. సెలక్ట్ & ఎలక్ట్ పద్ధతిలోనే ఎంపిక ఉంటుంది’ అని తెలిపారు పొన్నం.