నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు

నాటినోళ్ల పేరే.. మొక్కకు పెడుతున్నరు

కార్పొరేటర్ దంపతుల డిఫరెంట్ థాట్
జనాల కేర్ టేకింగ్​తో 97 శాతం బతికిన ప్లాంట్స్
బండ్లగూడ జాగీర్ 19వ డివిజన్​లో సరికొత్తగా పరిరక్షణ

హైదరాబాద్, వెలుగు: మొక్కలు నాటడం ఈజీయే. కానీ వాటిని సంరక్షించటమే కష్టమైన పని. ప్రభుత్వం హరిత హారంలో భాగంగా కోట్లాది మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టినప్పటికీ అందులో 50 శాతం మొక్కలు కూడా బతకడం లేదు. దీంతో అనుకున్న టార్గెట్ నేరవేర్తలేదు. ఈ సమస్యను గుర్తించిన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్​లోని ఓ డివిజన్ కార్పొరేటర్ దంపతులు నాటిన మొక్కలను పరిరక్షించటంపై ఫోకస్ చేశారు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో  మొక్కల సంరక్షణలో జనాలు పార్టిసిపేట్ అయ్యేలా  చేశారు. ఎవరు నాటిన మొక్కకు వారి పేరే పెట్టేశారు. ఆ మొక్కను పరిరక్షించే బాధ్యతను వారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్​కు  అప్పగించారు. దీంతో ఆ మొక్క ఎవరి పేరుతో అయితే ఉందో వాళ్లే దాని కేర్ టేకర్ గా మారారు. ఈ సక్సెస్ ఫుల్ థాట్​తో నాటిన మొక్కల్లో 97 శాతం బతకడం విశేషం.

లాక్ డౌన్  నుంచి స్టార్ట్ 

బండ్లగూడ జాగీర్ లోని 19 వ డివిజన్ కార్పొరేటర్ నాగుల స్రవంతి లాక్ డౌన్​లో ఈ  ఆలోచన చేశారు. డివిజన్​ను గ్రీనరీకి కేరాఫ్ అడ్రస్ గా మార్చాలన్న ఉద్దేశంతో కొత్త ప్రోగ్రామ్ చేపట్టారు. ఆమె భర్త నాగుల నరేందర్​తో కలిసి ముందుగా తమ కాలనీలో మొక్కలను నాటడం మొదలుపెట్టారు. లాక్ డౌన్ లో స్టూడెంట్స్, ఉద్యోగులంతా ఇంట్లోనే ఉండటంతో వారిని కలిసి తమ ఐడియాను పంచుకున్నారు. మొక్కలు నాటడమే కాదు వాటిని సంరక్షించినప్పుడే అనుకున్న టార్గెట్ ను చేరుకోగలమని వివరించారు. మొక్కలు నాటడం మొదలు పెట్టి వాటికి ఫెన్సింగ్ వేశారు. ఏ ప్రాంతంలో మొక్కను నాటుతారో ఆ ఇంట్లో ఉన్న చిన్న పిల్లల పేర్లు వాటికి పెట్టారు. దీంతో లాక్ డౌన్ లో ఇంట్లోనే ఉన్న పిల్లలు, వారి పేరెంట్స్ ఆ మొక్కలను చక్కగా చూసుకోవటం మొదలు పెట్టారు. ప్రస్తుతం  ఈ ప్రోగ్రామ్​లో వారు యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు.

1600 మొక్కలు నాటిన్రు

జనాలు భాగస్వాములుగా మారిన తర్వాత ఈ ప్రోగ్రామ్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. 19 వ డివిజన్ లో 6 నెలల్లో 1600 మొక్కలను నాటారు. బాదం, వేప, స్పతోడియా సహా పలు రకాల పండ్ల మొక్కలు, హరిత హరంలో ప్రభుత్వం ఇచ్చిన మొక్కలను వార్డులో ప్రజలకు పంపిణీ చేశారు. ఒక్కో ఇంట్లో ఇద్దరి పేర్లతో రెండు మొక్కలు నాటారు. ఇంటి ముందున్న మొక్కల బాధ్యతను ఆ ఇంట్లో వాళ్లే చూసుకుంటున్నారు. కొన్ని మొక్కలకు ఇంట్లో ఎవరైనా చనిపోతే వారి జ్ఞాపకార్థం పేరు పెడుతున్నరు.  కాలనీలకు దూరంగా రోడ్డుకి ఇరువైపుల నాటుతున్న మొక్కలకు  మహనీయుల పేర్లు పెడుతున్నారు. గాంధీ, భగత్​సింగ్, సుభాష్​చంద్రబోస్, అంబేద్కర్, కలాం పేర్లతో మొక్కలు నాటి వాటిని కాలనీలు వాసులు, కార్పొరేటర్ దంపతులు పరిరక్షిస్తున్నారు.

త్వరలో జియో ట్యాగింగ్

మొక్కలకు త్వరలోనే జియో ట్యాగింగ్ కూడా చేయనున్నారు. దీంతో మొక్కల ఎదుగుదలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేక యాప్​ని కూడా సిద్ధం చేస్తున్నారు.  నావిగేషన్‌‌‌‌ సింబల్‌‌‌‌ను యాక్టివేట్‌‌‌‌ చేసి మొక్క ఫోటో తీసి యాప్ లో ఏర్పాటు చేస్తారు. ప్రతి మొక్కకు ఓ నంబర్ ఇచ్చి ఆన్ లైన్ లో వివరాలు ఎంటర్ చేస్తరు. దీంతో  ఏ ఏ ప్రాంతాల్లో మొక్కల పరిస్థితి ఎలా ఉందో  ఈజీగా తెలిసిపోతుంది. దీంతో పాటు మొక్కల పరిరక్షణలో మరింత మంది పార్టిసిపేట్ చేసేందుకు ప్రైజ్ మనీ కూడా అందించనున్నారు. జూన్ 5 న ఎన్విరాన్ మెంట్ డే రోజున మొక్కలను రక్షిస్తున్న వాళ్లందరీ పేర్లతో లాటరీ తీసి 10 మందికి రూ. 5వేల క్యాష్​  అందించనున్నారు.

డివిజన్​ను గ్రీనరీకి కేరాఫ్​గా మారుస్తా

నాటిన మొక్కలను పరిరక్షించటమే అసలైన సవాల్.  జనాల సహకారంతో చాలా వరకు నాటిన మొక్కలను రక్షిస్తున్నాం. డివిజన్​ను గ్రీనరీకి కేరాఫ్ అడ్రస్​గా మార్చటమే లక్ష్యం. ఎక్కువగా పండ్ల మొక్కలు నాటుతున్నాం. దీంతో పెద్దయ్యాక అవి జనానికి ఉపయోగపడతాయి.

    ‑ నాగుల స్రవంతి నరేందర్, 19 వ డివిజన్​ కార్పొరేటర్, బండ్లగూడ జాగీర్​

మంచి రిజల్ట్ వస్తోంది

ఏటా వేలల్లో మొక్క లు నాటుతున్నప్పటికీ అవి బతకడం లేదు. ఇలా అయితే ప్రయోజనం లేదని కొత్తగా ఆలోచించాం. లాక్ డౌన్ టైమ్ లో ఎక్కువ  మంది ఇంటి వద్దే ఉండటంతో జనాలను భాగస్వాములుగా చేయాలని నిర్ణయించాం. వారి పేర్లతో మొక్కలు నాటడంతో కేర్ గా చూసుకుంటున్నరు. మంచి రిజల్ట్ వస్తోంది.

   ‑ నాగుల నరేందర్,  కార్పొరేటర్​ భర్త