నేషనల్ కరిక్యులంపై 23 భాషల్లో సర్వే

నేషనల్ కరిక్యులంపై 23 భాషల్లో  సర్వే

హైదరాబాద్, వెలుగు: నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ – 2020 అమలులో భాగంగా కొత్తగా రూపొందించాల్సిన నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్​పై కేంద్రం దేశవ్యాప్త సర్వేకు సిద్ధమైంది. సర్వేలో భాగంగా సిలబస్, పుస్తకాలు, టీచింగ్ ఎయిడ్ రూపకల్పన, తదితర అంశాలపై ఇప్పటికే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. మొబైల్ యాప్, వెబ్ సైట్ ద్వారా  మొత్తం 11 అంశాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తోంది. http://vsms.sms.gov.in/OMZhm8YvAQE లింక్ ద్వారా ఎవరైనా తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. 

సర్వేలో ప్రశ్నలు ఎలా ఉన్నాయంటే..!

రాజ్యాంగం గుర్తించిన 23 భాషల్లో ఈ ఆన్‌‌లైన్ సర్వేను చేపట్టారు. ఒక్కో ప్రశ్నకు నాలుగైదు ఆప్షన్ల చొప్పున పది ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి డిస్ ప్లే అవుతాయి. స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా స్టూడెంట్స్ ఏం సాధించాలనుకుంటున్నారు? స్కూల్స్, సొసైటీకి మధ్య బంధాన్ని పెంచడానికి ఉత్తమ మార్గాలు ఏమిటి? పర్యావరణ సంక్షోభంపై విద్యార్థులను ఏ విధంగా సిద్ధం చేయాలి? వంటి ప్రశ్నలు ఉన్నాయి. కరోనా మహమ్మారితో స్కూల్స్ మూతపడడంతో చాలా మంది పిల్లలకు నష్టం జరిగింది. అలాంటి వారు చదువులో రాణించేందుకు ఉత్తమ మార్గాలేమిటి ? తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై మరింత దృష్టి పెట్టాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. క్లాస్ రూమ్​లో విద్యార్థి సంతోషంగా పాఠం నేర్చుకునేందుకు కొన్ని ఉత్తమ మార్గాలు ఏమిటి?, టెన్త్, ఇంటర్ బోర్డు పరీక్షల్లో తీసుకురావాల్సిన మార్పులను సూచించండి? అనే ప్రశ్నలు ఉన్నాయి. చివరగా 2వేల అక్షరాల్లోపు అభిప్రాయాన్ని ఇందులో టైప్ చేసి పంపేందుకు బాక్స్ ఇచ్చారు.