రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం .. కాంక్రీట్​గా ​మారుతున్న సిటీ పార్కులు

రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం .. కాంక్రీట్​గా ​మారుతున్న సిటీ పార్కులు

హైదరాబాద్​, వెలుగు: కేబీఆర్ నేషనల్ పార్కు..  రాజకీయ, సినీ ప్రముఖులు, ఐఏఎస్, ఐపీఎస్​లు మార్కింగ్ వాక్​లు చేయడానికి  సెంటర్ పాయింట్.  సిటీ సెంటర్​లో ఉన్న ఇలాంటి పార్కులకు ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. శివార్లలోఉన్న వాటిని మాత్రం ఆగం జేస్తోంది. అభివృద్ధి పేరుతో పచ్చని పార్కులను కాంక్రీట్​గా ​మారుస్తోంది. ఎల్​బీనగర్ సెగ్మెంట్ పరిధి ​వనస్థలిపురంలో 1,354 హెక్టార్లలో(3,345 ఎకరాలు) మహవీర్ హరిణ వనస్థలి నేషనల్ పార్కు విస్తరించి ఉంది.

ఎన్నో ఏండ్ల చరిత్ర ఉన్న ఈ పార్కులో కృష్ణ జింకలతో పాటు దుప్పులు, కుందేళ్లు, అడవి పందులు, ముళ్ల పందులు, నెమళ్లు, వందల రకాల పక్షులు ఉన్నాయి. ఇక్కడున్న రెండు వాకింగ్ ట్రాక్ లలో ప్రతిరోజు వందల మంది వాకింగ్ చేస్తుంటారు. అయితే, ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పార్కు కొంత భాగం ఇప్పటికే పాడైపోయింది. మరో అనాలోచిత నిర్ణయంతో ఈ పార్కు మరింత ప్రమాదంలో పడబోతోందని స్థానికులతో పాటు పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అధునాతన బస్ టెర్మినల్ కోసం..

ఆటోనగర్ ఇండస్ట్రీ ఏరియాతో పాటు సిటీ నుంచి వస్తున్న మురుగు హరిణ వనస్థలి పార్కులోకి చేరి సుమారు 20  ఎకరాల్లో ప్రమాదకర కెమికల్స్ వ్యాపించాయి. దీంతో పార్కులో ఉన్న వన్యప్రాణులకు ముప్పుగా మారింది. ఇదిలా ఉండగా ఇప్పుడు పార్కు ముందు భాగం ఆటోనగర్ వైపు అధునాతన ఏసీ శాటిలైట్ బస్ టెర్మినల్ తీసుకు రావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబదించిన ప్రతిపాదనలన్నీ పూర్తయ్యాయి. రూ.18 కోట్ల నిధులతో 24 బస్ బేలతో ఈ బస్ టెర్మినల్ నిర్మించనున్నారు.

నాలుగేండ్ల క్రితమే ఈ ప్రతిపాదనను తీసుకురాగా వన్యప్రాణులకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్థానికులు దీన్ని అప్పటినుంచే వ్యతిరేకిస్తున్నారు. కొద్ది రోజుల కిందమే అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆధ్వర్యంలో వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసి టెర్మినల్​ కోసం క్లియరెన్స్ ఇచ్చారు. ఇందుకోసం పార్కుకు సంబంధించిన సుమారు 3 ఎకరాల భూమిని సేకరించనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సైతం పంపారు. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఇక్కడ బస్ టెర్మినల్ పనులు ప్రారంభం కానున్నాయి.

డ్రైనేజీ, ఇండస్ట్రీల నుంచి కెమికల్స్

ఆటోనగర్​తోపాటు మరి కొన్ని ప్రాంతాల నుంచి వచ్చే డ్రైనేజీ, ఇండస్ట్రీల నుంచి వచ్చే మురుగు, కెమికల్ వేస్టేజ్  పార్కులోకి చేరుతోంది. సుమారు 20 ఎకరాల్లో మురుగు నీరు చేరి.. అది ఉన్నంత మేర పెద్ద పెద్ద చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. వన్యప్రాణులు ఈ మురుగు నీటిని తాగి రోగాల బారిన పడుతున్నట్లు జంతు ప్రేమికులు చెబుతున్నారు. మురుగు పార్కులోకి రాకుండా ఎలాంటి చర్యలు చేపట్టని ప్రభుత్వం.. వన్యప్రాణుల జీవనానికి ఆటంకం కలిగేలా పార్కు వద్ద బస్​ టెర్మినల్ ​తీసుకు రావడాన్ని చాలా మంది వ్యతిరేకిస్తున్నారు.

కేబీఆర్ పార్కులా..

హరిణ వనస్థలి పార్కు రెండు గేట్ల నుంచి వందల సంఖ్యలో వాకర్స్ మార్కింగ్, ఈవెనింగ్ వాకింగ్ చేస్తుంటారు. అయితే ఈ బస్ టెర్మినల్ నిర్మాణంతో ఎయిర్ పొల్యూషన్​తో వాకర్స్​కు​, వన్యప్రాణులకు సైతం ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. సిటీ సెంటర్​లో ఉన్న కేబీఆర్ పార్కు మాదిరిగా  హరిణ వనస్థలి పార్కును ముందుస్తుగా  కాపాడుకుంటే బాగుంటుందని పర్యావరణ వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 

నిర్లక్ష్యం వీడి పార్కులను అభివృద్ధి చేయాలి

ఏ ప్రాంతంలో అయినా 32 శాతం గ్రీనరీ ఉంటే అక్కడ సమతుల్య వాతావరణం ఉండి, మనం పీల్చే గాలి స్వచ్ఛమైనదని అటవీ చట్టాలు చెబుతున్నాయి. కానీ సిటీలో ఆ పరిస్థితి లేదు. ఉన్న కొంత పచ్చదనాన్ని ఆగం జేస్తున్నరు. హరిణ వనస్థలి నేషనల్ పార్కును ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఓ వైపు కెమికల్ వాటర్, ఇప్పుడు బస్ టెర్మిన
ల్​తో ఇబ్బందే. ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి పార్కులను కాపాడాలి. – శ్యాంసుందర్, వనరుల సంరక్షణ సమితి అధ్యక్షుడు

ఈ ప్లేస్​లో పెట్టడం కరెక్ట్ కాదు

ప్రస్తుత, భవిష్యత్ తరాలకు పార్కులు చాలా ముఖ్యం. ప్రభుత్వ నిర్ణయంతో ఈ పార్కు పాడయ్యే అవకాశం ఉంది. ప్రజారవాణా సౌకర్యానికి బస్ టెర్మినల్ అవసరమే కానీ ఈ ప్లేస్​లో పెట్టడం సరైన నిర్ణయం కాదు. ప్రైవేటు స్థలం లేదా పార్కుకు దూరంలో ఏర్పాటు చేయాలి. –మనోజ్, మన్సూరాబాద్