ట్రైబల్​ మ్యూజియంపై నిర్లక్ష్యం

ట్రైబల్​ మ్యూజియంపై నిర్లక్ష్యం
  •     జోడేఘాట్​లో రూ. 25 కోట్లతో కట్టి నిర్వహణ మరిచిన సర్కారు
  •     మూడేండ్లుగా క్యూరేటర్​ లేక పరేషాన్​
  •     నీళ్లు పోసేవారు లేక ఎండిపోయిన మొక్కలు


ఆసిఫాబాద్, వెలుగు: ఆదివాసీ యోధుడు కుమ్రంభీం పోరాట గడ్డ జోడేఘాట్​ను అధికారులు, పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇక్కడ రూ. 25 కోట్లతో గిరిజన మ్యూజియం కట్టిన ప్రభుత్వం మూడేళ్ల నుంచి క్యూరేటర్ ను నియమించడం లేదు. క్యూరేటర్ కోసం ఐటీడీఏ అధికారులు 2019లో నోటిఫికేషన్ ఇచ్చి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. నేటికీ ఎంపిక విషయాన్ని పట్టించుకోవడం లేదు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఏళ్ల సంది నియామకం కోసం ఎదురుచూస్తున్నారు. మ్యూజియం గురించి, కుమ్రంభీం చరిత్ర, చారిత్రక ప్రాంతం గురించి చెప్పేవారు లేక ఇక్కడికి వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపడం లేదు.

స్థల వివాదం.. క్యూరేటర్​ రాజీనామా

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్ గ్రామంలో 2014 లో నిర్వహించిన కుమ్రంభీం వర్ధంతి సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. గిరిజన దర్బార్ లో మాట్లాడుతూ జోడేఘాట్ ను టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దుతామని, ట్రైబల్ మ్యూజియం నిర్మిస్తామని చెప్పారు. ట్రైబల్​మ్యూజియాన్ని 2016లో మంత్రులు కేటీఆర్, చందులాల్ ప్రారంభించారు. మ్యూజియం నిర్మాణ పనులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టారు. మ్యూజియం నిర్వహణను ఐటీడీఏ ఆఫీసర్లకు అప్పగించారు. జోడేఘాట్ లో రెండేళ్ల క్రితం శ్మశానవాటిక జాగ ఎంపిక విషయంలో అప్పటి క్యూరేటర్, గ్రామస్థుల మధ్య వివాదం చోటుచేసుకుంది. క్యూరేటర్, గ్రామస్థుల మధ్య సమన్వయం కొరవడడంతో అప్పటి క్యూరేటర్, సిబ్బంది తాము ఇక్కడ డ్యూటీ చేయలేమంటూ రాజీనామా చేశారు. ఐటీడీఏ అధికారులు క్యూరేటర్, అటెండర్ పోస్టు కోసం నోటిఫికేషన్ జారీ చేసి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. రెండేళ్లు గడుస్తున్నా అతీగతీ లేదు. క్యూరేటర్ లేకపోవడంతో జోడేఘాట్ గిరిజన ఆశ్రమ పాఠశాల హెచ్ ఎం కు అధికారులు మ్యూజియం బాధ్యత అప్పగించారు. జోడేఘాట్ కు వచ్చే పర్యాటకులకు ఈ టీచర్ మ్యూజియం చూపించాల్సి వస్తోంది. అయితే ఇక్కడ తాగునీరు, వెయిటింగ్ హాల్, టాయిలెట్స్, క్యాంటీన్​ సదుపాయాలు లేకపోవడంతో టూరిస్టులు ఇబ్బంది పడుతున్నారు. మ్యూజియం సమీపంలో ఉన్న 80 ఎకరాల్లో 2015, 2018లో 32 వేల మొక్కలు నాటారు.  నిర్వహణ కొరవడడంతో వేలాది మొక్కలు నామరూపాలు లేకుండా పోయాయి.

బోసిపోతున్న బృందావనం

ఆవరణలో సుగంధద్రవ్యాల మొక్కలతో పాటు ఆయుర్వేదం మొక్కలను పెంచి ప్రజలకు ఆయుర్వేదంపై అవగాహన కలిగించాలనే లక్ష్యంతో వంద రకాల మొక్కలతో జోడేఘాట్ లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 2018లో బృందావనం ఏర్పాటు చేశారు. వివిధ ఔషధ మొక్కలతో తీర్చిదిద్దారు. మొక్కలకు నీళ్లు పోసే దిక్కు లేక అన్నీ ఎండిపోయాయి. ప్రస్తుతం ఒక్క మొక్క కూడా లేదు. 

క్యూరేటర్ ను నియమించాలె

రెండేళ్లుగా క్యూరేటర్ లేక టూరిస్టులు, స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు ఎంపిక ను పట్టించుకోవడం లేదు. కోట్లాది రూపాయలతో కట్టిన మ్యూజియానికి క్యూరేటర్, సిబ్బందిని నియమించకపోవడం కరెక్ట్ కాదు. నీళ్లు లేక మొక్కలు మొత్తం ఎండిపోయినయ్. అధికారులు పట్టించుకోవట్లే. టూరిస్టులకు, ప్రజలకు పచ్చదనం కరువైంది.
- పెందోర్ రాజేశ్వర్, జోడేఘాట్ గ్రామస్థుడు

నిర్లక్ష్యం తగదు

ఆదివాసీల ఆరాధ్య దైవం కుమ్రంభీం పోరుగడ్డను నిర్లక్ష్యం చేయడం కరెక్ట్ కాదు. క్యూరేటర్ లేనప్పుడు టూరిస్టులకు కుమ్రంభీం  పోరాట చరిత్ర, ప్రత్యేకత ఎవరు చెబుతారు. మ్యూజియాన్ని ఆగమేఘాల మీద కట్టిన గవర్నమెంట్ మౌలిక సదుపాయాలు మాత్రం కల్పించడం లేదు. క్యాంటీన్, వెయిటింగ్ హాల్, తాగునీరు, టాయిలెట్ వంటి సదుపాయాలు కల్పించాలి. 
- కోట్నక్ విజయ్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి